మూడు దశాబ్దాల అంతరానికి ఫుల్ స్టాప్. ఎన్టీఆర్ అల్లుళ్ల అపూరూప కలయిక

దగ్గుబాటి రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు.

Update: 2025-02-25 07:58 GMT

మహానేత దివంగత ఎన్టీఆర్ అల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అపూర్వ కలయిక టీడీపీ శ్రేణులను ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలు ఈ ఇద్దరి మధ్య కొనసాగిన రాజకీయ వైరానికి గత ఎన్నికల ముందు ఎండ్ కార్డు పడింది. అడపాదడపా ఈ ఇద్దరూ కలుస్తున్నా, ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్లిన సందర్భం ఇంతవరకు లేదు. అయితే తాజాగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి దగ్గుబాటి రావడం రెండు కుటుంబాల మధ్య ఆనందాన్ని పంచింది. దగ్గుబాటి రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడళ్లుల్లు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుళ్లు అయిన ఈ ఇద్దరు 1995 వరకు కలిసిమెలిసి ఉండేవారు. టీడీపీ అభివృద్ధికి జోడెద్దులుగా కష్టపడ్డారు. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత ఏర్పడిన చంద్రబాబు తొలి ప్రభుత్వంలో దగ్గుబాటి మంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లకు విభేదాలు తలెత్తాయి. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఇద్దరూ రాజకీయంగా వైరిపక్షాల్లోనే కొనసాగుతూ వచ్చారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన దగ్గుబాటి ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో కొన్నాళ్లు పనిచేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ తీరుతో విసిగిపోయి ఆ పార్టీతో బంధాన్ని తెంచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తన తోడళ్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మళ్లీ సత్సంబంధాలు ఏర్పడటంతో రెండు కుటుంబాల మధ్య అంతరం తొలగిపోయింది.


చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, దగ్గుబాటి భార్య పురందేశ్వరి స్వయాన అక్కచెల్లెళ్లు అయినా, రాజకీయ విభేదాలతో కొన్నాళ్లు మాట్లాడుకోలేదని చెబుతారు. అయితే దగ్గుబాటి వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఇరుకుటుంబాల మధ్య మాటలు కలిశాయని చెబుతారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పురందేశ్వరి గత ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడటంలో కీలకంగా పనిచేశారు. ఇలా ఇరుకుటుంబాల మధ్య రాజకీయంగా సఖ్యత ఏర్పడింది. కూటమి భాగస్వామ్య పక్ష నేతగా పురందేశ్వరి తరచూ చంద్రబాబు ఇంటికి వస్తున్నా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇన్నాళ్లు చంద్రబాబు ఇంటికి రాలేదు. అయితే తాను రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు దగ్గుబాటి తొలిసారిగా ఉండవల్లి వచ్చారు. ఆయనను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు.

Tags:    

Similar News