ఏపీకి అప్పు పుట్టడం లేదు... జగన్ మీద బాబు సంచలన కామెంట్స్
ఏపీకి అప్పు పుట్టకపోవడానికి కారణం మాజీ సీఎం జగన్ అని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీకి అప్పు పుట్టడం లేదు, ఖజానాలో నిధులు లేవు. ఏమి చేయమంటారు అని డైరెక్ట్ గా జనాలతోనే ఉన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేశారు. ఏపీకి అప్పు పుట్టకపోవడానికి కారణం మాజీ సీఎం జగన్ అని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి 10 లక్షల 50 వేల కోట్లు అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయాడని బాబు చెబుతున్నారు
జగన్ ఎక్కడ లేని విధంగా అన్నీ ఊడ్చేసి అప్పులు చేసేశారు. దాంతో తాను అప్పు చేద్దామన్నా ఏపీకి ఎవరూ ఇవ్వడం లేదు అని బాబు సరికొత్త విషయం చెప్పారు. ఏపీకి ఆదాయం తక్కువ ఖజానా ఖాళీగా ఉంది. పోనీ అప్పులు అయినా చేద్దామంటే అసలు కుదరడం లేదు, దీనికి జగన్ కారణం అని చంద్రబాబు అతి పెద్ద బండ వేసేసారు.
ఏపీకి వరదలు భారీగా వచ్చాయి. ఇంతటి తీవ్రత ఎక్కడా గతంలో లేదు, మరి ఇంతలా వరదలు వచ్చినా అందరికీ న్యాయం చేయలేకపోయామని పూర్తిగా సాయం చేయలేకపోయామని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.
చంద్రబాబు విజయవాడలోని ముపు ప్రాంతాలు అయిన భవానీపురం, ఊర్మిలా నగర్ లలో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు, ఆయన ఈ సమయంలోనే అప్పు గురించి జగన్ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీకి అప్పు కూడా పుట్టని దుర్గతి ఏర్పడింది అని వాపోయారు. దానికి జగన్ చేసిన విచ్చలవిడి అప్పులే కారణం అన్నారు.
ఈ విపత్తు దారుణంగా వచ్చింది. అయినా కూడా తనకు అందరికీ న్యాయం చేయాలని ఉందని చేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు ఏపీకి అప్పులు ఉన్నాయని అవి జగన్ వల్లనే అని చెబుతున్నారు. దాంతోనే డబ్బులు లేవని అంటున్నారు.
మరి ప్రజలు ఆయనను అర్ధం చేసుకుంటారా అన్నది ఒక చర్చ. అదే సమయంలో ఏపీకి ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయని మొదట తెలిసింది బాబుకే కదా అని కూడా అంటున్నారు. ఏపీ అప్పులతోనే నడుస్తోంది. ఆ విషయం విభజన తరువాత తొలిసారి సీఎం అయిన బాబుకు కూడా తెలుసు అని అంటున్నారు.
మరి వరదలకు సాయం చేయలేకపోతే బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల సంగతేంటి అన్నది జనంలో చర్చకు వస్తోంది. అయితే జనాలకు ఇవి అన్నీ పడతాయా అన్నది మరో కీలక ప్రశ్న. ఎందుకంటే ప్రజలు ఎపుడూ పాలకుల బాధలు ఆలోచించరు, తమకు తక్కువ చేస్తే ఊరుకోరు. అంతదాకా ఎందుకు ప్రభుత్వంలో ఉంటూ కీలక భాగస్వామ్యంగా ఉంటూ వస్తున్న ఉద్యోగులే తమకు ఏమైనా రావాల్సింది తగ్గితే ఊరుకోరు అన్నది కూడా తెలిసిందే.
మరి ఇన్ని తెలిసి బాబు ఎందుకు ఇలా జనంలోకి వచ్చి చెబుతున్నారు అంటే జనాలలో ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశల హైప్ తగ్గాలని, తద్వారా ప్రభుత్వం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలన్నదే బాబు ఆలోచన అని అంటున్నారు. మొత్తానికి వరదల వల్ల ఇబ్బందులు వస్తే కేంద్రం వద్ద ప్రకృతి విపత్తుల కోసం ప్రత్యేక నిధులు ఉంటాయి.
కేంద్రంలో ఎటూ టీడీపీ మద్దతుతో ఉన్న ప్రభుత్వమే నడుస్తోంది. దాంతో బాబు పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చి ఖర్చు చేయవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు అప్పులు పుట్టడం లేదు అంటే ఉన్న వాటిని పొదుపు చేసుకోవాలి. అదే సమయంలో ప్రాణావసరం అన్న వాటికి ఖర్చు చేయాలని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అప్పు తప్పు జగన్ దే అంటూ బాబు చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.