బిల్ గేట్స్, బాబు మధ్య మరో భేటీ.. ఈ సారి ఢిల్లీలో..
మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బుధవారం బిల్ గేట్స్ తో సమావేశమవుతారు.;
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బుధవారం బిల్ గేట్స్ తో సమావేశమవుతారు. ఈ ఇద్దరు ఇప్పటికే జనవరిలో ఓ సారి భేటీ అయిన విషయం తెలిసిందే.. ఏపీలో పెట్టుబడులతోపాటు గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణకు బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చించనున్నారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇంట్లో ఓ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ కానున్నారని చెబుతున్నారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంల పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా అడిగినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉందంటున్నారు.
ఇక 19వ తేదీన సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ తో సమావేశమవుతారు. దావోస్ లో ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఢిల్లీలో ఈ భేటీ జరుగుతోందని చెబుతున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సహకారం ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబు దావోస్ లో బిల్ గేట్స్ ను కోరారు. దీనిపై తన టీమ్ తో చర్చించి చెబుతానని అప్పట్లో బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. దీంతో తాజా భేటీలో ఈ విషయమై ఓ అవగాహన కుదిరే అవకాశం ఉందంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య సుమారు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి 1999లో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. అప్పట్లో హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించాలని కోరారు. తొలుత చంద్రబాబుతో సమావేశానికే ఇష్టపడని బిల్ గేట్స్ ఓ 10 నిమిషాలు సమయమిచ్చారు. ఆ తొలి భేటీలో చంద్రబాబు విజనరీ బిల్ గేట్స్ ను ఆకట్టుకోవడంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ స్థాపనకు అంగీకరించారు. అలా దాదాపు మూడు దశాబ్దాలుగా చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల దావోస్ లో కలిసిన చంద్రబాబుకు తాను రచించిన ‘సోర్స్ కోడ్’ అనే పుస్తకాన్ని అందజేశారు.