'తల్లికి వందనం - పిల్లల్ని కనడం'పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

గతంలో “అమ్మ ఒడి” అని వైసీపీ సర్కార్ ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకే డబ్బులు అందిస్తే... తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 అని నాడు కూటమి నేతలు ప్రకటించారు.

Update: 2025-03-01 18:57 GMT

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన కీలక హామీల్లో "తల్లికి వందనం" అనే పథకం ఒకటనే సంగతి తెలిసిందే. గతంలో “అమ్మ ఒడి” అని వైసీపీ సర్కార్ ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకే డబ్బులు అందిస్తే... తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 అని నాడు కూటమి నేతలు ప్రకటించారు.

ఈ సమయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ పథకం అమలు కానప్పటికీ.. 2025-26 విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన వార్షిక బడ్జెట్ లో “తల్లికి వందనం” పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించింది. ఈ సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... చిత్తురు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు.. తల్లికి వందనం పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జననాల రేటు పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎవరు ఎంత మంది పిల్లలను కన్నా.. వారి చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు!

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... “తల్లికి వందనం” పేరుతో ఒక్కొక్కరికీ రూ.15వేలు అందజేస్తామని.. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15,000 అందజేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన నిధులు మే నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో... జనాభా తగ్గిపోతుందని, అందువల్ల అంతా ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు!

లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తుందని.. ప్రపంచం మొత్తం ముసలి వాళ్లు అయిపోతున్నారని.. పిల్లలు లేరని, వాళ్లను చూసుకోవాలంటే మనుషులు లేరని.. డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే తాను ముందుగానే ఆలోచించి.. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేలు ఇస్తే ఆ పిల్లలను పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా... ఇద్దరు, ముగ్గురు పిల్లలైనా పర్లేదని.. పిల్లలే మన ఆస్తి అని, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News