తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు.. బాబు సూపర్ కండిషన్!
ఈ నేపథ్యంలో తాజాగా "తల్లికి వందనం" పథకానికి సంబంధించి జీవో విడుదల చేసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటినీ ప్రాముఖ్యతా ఆధారంగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్లు పెంచి, ఏరియర్స్ తో సహా పంపిణీ చేసింది.. మెగా డీఎస్సీపై కసరత్తులు మొదలుపెట్టింది.. అన్న క్యాంటీన్ల పైనా దృష్టి పెట్టింది.. ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా "తల్లికి వందనం" పథకానికి సంబంధించి జీవో విడుదల చేసింది.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కో హామీని అమలుచేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఇందులో భాగంగా... ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే విద్యార్థులకు "తల్లికి వందనం" పేరుతో ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా బాబు సర్కార్ పెట్టిన కండిషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా ఆధార్ ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డ్ లేకపోతే... వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు వచ్చేవరకూ 10 రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆధార్ కు ప్రత్యామ్న్యాయంగా ఉన్న పత్రాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇందులో భాగంగా... ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, బ్యాంక్ లేదా తపాలా పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్ బుక్, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రాలను అనుమతిస్తారని తెలిపారు.
ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, స్కూళ్లకు పిల్లని పంపించే తల్లులకు (తల్లి లేకపోతే తండ్రి / సంరక్షకుడు) ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఇదే క్రమంలో... విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వ్యుల్లో ప్రభుత్వం తెలిపింది. దీంతో... ఈ 75శాతం అటెండెన్స్ నిర్ణయం సూపర్ కాంప్లిమెంట్స్ తో కూడిన కామెంట్స్ వినిపిస్తున్నాయి.