పాలిటిక్స్ లో బాబు ఇన్నింగ్స్ ముగిసాయా...?
చంద్రబాబు అంటేనే రాజకీయం. ఆయన ఆశ, శ్వాస సర్వం పాలిటిక్స్. చంద్రబాబు రాజకీయ వయసు ఎంత అంటే కచ్చితంగా చెప్పాలీ అంటే యాభై ఏళ్ళు పై మాటే అనుకోవాలి.
చంద్రబాబు అంటేనే రాజకీయం. ఆయన ఆశ, శ్వాస సర్వం పాలిటిక్స్. చంద్రబాబు రాజకీయ వయసు ఎంత అంటే కచ్చితంగా చెప్పాలీ అంటే యాభై ఏళ్ళు పై మాటే అనుకోవాలి. ఎందుకంటే ఆయన విద్యార్ధి జీవితం నుంచే రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ విద్యార్ధి నాయకుడిగా ఆయన తన కెరీర్ స్టార్ట్ చేశారు. అలాగే స్టూడెంట్ గా ఉంటూనే 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి కేవలం 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయిపోయారు. పెళ్ళి కాకుండానే మంత్రి కూడా అయ్యారు.
సీన్ కట్ చేస్తే టీడీపీలోకి వచ్చిన బాబు నలభై అయిదేళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. అలా తొమ్మిదేళ్ల పాటు ఆయన ఉమ్మడి ఏపీని పాలించి విభజన ఏపీకి అయిదేళ్ల పాటు ఆరున్నర పదుల వయసులో సీఎం అయ్యారు. ఇలా బాబు రాజకీయ జీవితం చూస్తే పడి లేచే కడలి తరంగాన్ని తలపిస్తుంది. ఎన్ని ఎత్తులు ఉన్నాయో అన్ని పల్లాలూ ఉన్నాయి.
అలా ఎగుడు దిగుడులను ఎన్నో తన పొలిటికల్ కెరీర్ లో చూసిన చంద్రబాబు తన మామ ఎన్టీయార్ పెట్టిన పార్టీకి సుదీర్ఘ కాలం ప్రెసిడెంట్ గా ఉన్నారు. బాబుకు టీడీపీ బలమా లేక టీడీపీకి బాబు బలమా అంటే జవాబు చెప్పలేని విధంగా ఉంటుంది. అంటే పరస్పర ఆధారితంగా బాబునూ టీడీపీని చూడాలి.
అసలు బాబు లేని టీడీపీని ఎవరూ కలలో కూడా ఊహించుకోలేదు. బాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పటికి 28 ఏళ్ళ లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ లో ఏనాడూ పార్టీకి ఒక అడుగు దూరంగా విడిచి వెళ్లలేదు. కానీ ఇపుడు ఏకంగా నలభై మూడు రోజుల పాటు టీడీపీలో బాబు లేకుండా పోయారు. ఆయన పొలిటికల్ డైరీని అలా అతలాకుతలం చేసింది స్కిల్ స్కాం కేసు. ఒకే ఒక్క కేసు, మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కేసు బాబుని కటకటాల వెనక్కి పంపింది.
బాబుని అరెస్ట్ చేయాలంటే ఏ అమరావతి రాజధాని స్కాం లోనో లేక పోలవరం విషయంలోనో అని అంతా అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే అమరావతి రాజధాని బిగ్ స్కాం అని వైసీపీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇక బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే 2019 ఎన్నికల వేళ ఏపీకి వచ్చి పోలవరం బాబుకు ఏటీఎం గా ఉపయోగపడుతోంది అని భారీ ఆరోపణలే చేశారు. ఈ రెండూ పెద్ద స్కాములుగానే జనంలో అనుకునేలా చేస్తూ వచ్చారు బీజేపీ వైసీపీ నేతలు.
ఇక ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజు టైం లో అమరావతి రాజధానికి తాను వేలాది కోట్ల రూపాయలు ఇచ్చామని అవి ఎక్కడికి పోయాయో చెప్పాలని టీడీపీని నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. టోటల్ గా చూస్తే చంద్రబాబు విషయంలో ఓటుకు నోటు స్కాం అని మరో దాని మీద కానీ అరెస్ట్ జైలు ఉండొచ్చు అని అంచనా వేసుకున్న వారికి ఏ మూల నుంచి వచ్చిందో స్కిల్ స్కాం ఇలా పాములా చుట్టుకుని జైలు గోడల మధ్యన బంధీని చేసింది. బాబు ఎపుడు బయటకు వస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఈ నేపధ్యంలో చంద్రబాబు రాజకీయ శకం ముగిసినట్లే అని వైసీపీని చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. బాబు చట్టాలకు అతీతుడు ఏమీ కాదని ఆయన అంటున్నారు. తాను అనేక కేసుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని, ఇపుడు ఒక్క బెయిల్ విషయంలో ఆయన తల్లకిందులు అవుతున్నారంటే అది బాబు రాజకీయ శకం ముగిసింది అనడానిక్ సరైన ఉదాహరణ అని మంత్రి అంటున్నారు.
సరే మంత్రి వ్యాఖ్యలు కాసేపు పక్కన పెట్టినా చంద్రబాబుకు 2024 ఎన్నికలు నిజంగా చాలా కీలకం అయినవి. ఒక విధంగా ఆయనకు ఇవి చివరి ఎన్నికలు అందుకే ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తరువాత డే వన్ నుంచి కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తూ గత నాలుగున్నరేళ్లుగా రాజకీయ దూకుడుని ఎక్కడా తగ్గించడంలేదు. అలాంటి బాబుని ఇపుడు ఏమీ కాకుండా చేసి జైలు గోడల మధ్యన ఉంచడంతో వైసీపీ సక్సెస్ అయింది అనుకోవాలి.
రాజకీయాల్లో ప్రతీ నిముషమూ విలువైంది. ఏపీలో చూస్తే ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. మరో అయిదు నెలలలో ఎన్నికల నగారా మోగనున్న వేళ బాబు జైలు నుంచి బయటకు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా టీడీపీ కోలుకుంటుంది. మరి బాబు జైలు జీవితం ఎంతలా కొనసాగితే అంతలా టీడీపీకి కూడా ఇబ్బందే.
ఇక పుణ్యకాలం గడచిపోయాక బాబు బయటకు వచ్చినా నో యూజ్ అన్నది కూడా వినిపిస్తోంది. బాబు లేని టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే అంతా కళ్లారా చూస్తున్నారు. ఆ పార్టీని నడిపించేది బాబు మాత్రమే అని అర్ధమైన వేళ ఆ చోదక శక్తి జైలులో ఉంటే ఇక్కడ టీడీపీకి ఊపిరి ఆడడంలేదు, అక్కడ చంద్రబాబుకు కూడా అడుగు ముందుకు పడడంలేదు.
మొత్తానికి అత్యంత కీలకమైన ఎన్నికల వేళ చంద్రబాబు జైలు గోడల మధ్య ఇరుక్కోవడం టీడీపీకి అతి పెద్ద దెబ్బగానే చూడాలి. బాబు పొలిటికల్ ఇన్నింగ్స్ కానీ టీడీపీ పొలిటికల్ లైఫ్ కానీ మొత్తంగా ఆయన విడుదల మీదనే ఆధారపడి ఉంది. మరి బాబు ఇన్నింగ్స్ అయిపోయాయని మంత్రి అంటున్నారు అంటే రేపటి రాజకీయం పసుపు పార్టీకి కలవరం కలిగించేలా ఉంటుందా అన్నదే ప్రశ్న.