మూడు హామీల అమలుకు బాబు సిద్ధం వైసీపీకి చుక్కలేనా ?

ఇక బాబు మాట ఇస్తారు కానీ హామీలు అమలు చేయరని విమర్శలు ఉన్నాయి.

Update: 2024-08-03 17:23 GMT

చంద్రబాబుని గతాన్ని చూపించి అండర్ ఎస్టిమేట్ చేస్తే ఏమవుతుందో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. బాబు తిరుగులేని విజయాన్ని సాధించి ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యారు. ఇక బాబు మాట ఇస్తారు కానీ హామీలు అమలు చేయరని విమర్శలు ఉన్నాయి. వాటినే నమ్ముకుని వైసీపీ కూర్చుంది.

అయితే వైసీపీ కి చుక్కలు కనిపించేలా ఒకే రోజున ఏకంగా మూడు హామీలను చంద్రబాబు అమలు చేయబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ హామీలు అమలులోకి రానున్నాయి. అందులో మొదటిది అన్న క్యాంటీన్లు అని అంటున్నారు. ఆ రోజున ఏపీవ్యాప్తంగా వంద దాకా అన్న క్యాంటీన్లు తెరచుకుంటాయని చెబుతున్నారు.

ఈ అన్న క్యాంటీన్లలో అయిదు రూపాయలకే అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం పేదలకు దొరుకుతుంది. ఇది గతంలో టీడీపీ అమలు చేసినపుడు బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఈసారి కూడా అంతకు అంత పేరు తెచ్చుకోవాలని టీడీపీ చూస్తోంది. మరో వైపు చూస్తే ఏపీవ్యాప్తంగా మరో 83 అన్నా క్యాంటీన్లను మరో రెండు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు అని అంటున్నారు.

అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న సూపర్ సిక్స్ హామీని బాబు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు. ఈ హామీ వల్ల ఆర్టీసీకి ఖజానా నుంచి నెలకు 250 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. అయినా సరే మహిళలకు ఈ పధకం అందించాలని బాబు పట్టుదలగా ఉన్నారు. ఈ హామీని కనుక తీరిస్తే మహిళాలోకం టీడీపీ కూటమి పట్ల పూర్తి ఆదరణ చూపిస్తుందని అంటున్నారు.

ఇక మూడవ పధకం చూస్తే తల్లికి వందనం. విద్యా సంవత్సరం ప్రారంభం అయి రెండు నెలలు గడిచిపోయాయి. ఈ పధకాన్ని అమలు చేయాలని తల్లులు చూస్తున్నారు. దాంతో ఈ పధకానికి కూడా ఆగస్టు పదిహేను నుంచి శ్రీకారం చుట్టాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈ పధకం ద్వారా ఒక తల్లికి ఎంత మందికి బిడ్డలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పధకం విధి విధానాలు కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది అని అంటున్నారు. ఈ పధకం కనుక అమలు చేస్తే టీడీపీ కూటమికి ఎనలేని పేరు వస్తుందని విపక్ష వైసీపీ సైతం ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఈ పధకం ద్వారా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఆర్ధిక సాయం అందుతుందా లేదా చూడాలి. ఏది ఏమైనా ఏపీకి ఈ ఆగస్టు 15 అతి పెద్ద సంక్షేమ పండుగ కానుంది. ఎపుడూ అభివృద్ధి కారకుడిగానే బాబుని చూస్తారు. కానీ ఆయన అసలైన సంక్షేమ సారధిగా మారి అమలు చేయబోతున్న ఈ మూడు కీలక హామీలతో ఏపీలో రాజకీయం పూర్తిగా మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News