కాంగ్రెస్ కు బాబు.. షర్మిల.. బీజేపీకి పవన్.. వ్యతిరేకులు ఏకం.. హరీశ్ ధ్వజం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ సందర్శనకు వెళ్లారంటేనే ఎన్నికలను వారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తోంది.

Update: 2023-11-03 11:29 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా లేదు.. శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇక నామినేషన్ల పర్వం మొదలుకానుంది. గత ఎన్నికలకు ఇప్పటికి తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును వెంటేసుకుని.. వామపక్షాలను కలుపుకొని బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. అందులోనూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన కేసీఆర్ అధికారాన్ని మరోసారి దక్కించుకున్నారు. ఇక ఇప్పటి పరిస్థితికి వస్తే తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్- అధికార బీఆర్ఎస్ మధ్యనే అన్నట్లు సాగుతోంది. అందులోనూ కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో సానుకూల పవనాలు వీస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. అయితే, అటు బీఆర్ఎస్ సైతం దీటుగానే పోరాడుతోందన్న కథనాలు వస్తున్నాయి. బీజేపీ మాత్రం మూడో స్థానంతోనే లేక రెండు-మూడు సీట్లు గెలిస్తే చాలన్నట్లుగానో ఉంది.

పదునెక్కుతున్న విమర్శలు..

తెలంగాణలో నవంబరు 30న జరిగే ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ సందర్శనకు వెళ్లారంటేనే ఎన్నికలను వారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సైతం రోజుకు రెండు సభల్లో పాల్గొంటున్నారు. ఆ పార్టీ ట్రబుల్ షూటర్ కీలక మంత్రి హరీశ్ రావు కూడా ప్రచారంలో ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తున్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన ప్రచారంలో మాట్లాడారు.

పోటీ చేయని బాబు.. కాంగ్రెస్ వెంట

సిద్దిపేట ప్రచారంలో హరీశ్ నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. పనిలో పనిగా జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపైనా విమర్శలు గుప్పించారు. పోటీ చేయనని చెబుతున్న చంద్రబాబు.. లోపాయికారీగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. ఇక పవన్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా బాధ పడిన పవన్ తో ఏవిధంగా కలుస్తారని బీజేపీని ప్రశ్నించారు. ఇక తెలంగాణకు పూర్తిగా అడ్డుపడిన వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏకంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. ఇలా తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటవుతన్నారని హరీశ్ రావు ఆరోపించారు.

బీఆర్ఎస్ కు ఇదే ప్రచార అస్త్రమా?

కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు, బీజేపీ-జనసేన పొత్తు, కాంగ్రెస్ కు షర్మిల అండ.. ఈ మూడు అంశాలను బీఆర్ఎస్ ఇకమీదట ప్రచారంలో హోరెత్తేలా చేయనుందా? తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నారని పదేపదే చెబుతూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టనుందా..? తాజాగా హరీశ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. మరి దీనిని కాంగ్రెస్ ఎలా దీటుగా తిప్పికొడుతుందో చూడాలి. అందులోనూ రేవంత్ వంటి వాక్పటిమ ఉన్న నాయకుడు దీనిపై గట్టిగా సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి ప్రచారం వెళ్లకుండా చేసే అవకాశం చిక్కనుంది.

Tags:    

Similar News