రోడ్లకు పీపీపీ అంటున్న బాబు జనాలకు టోల్ దెబ్బ ఖాయం

ఉన్న రూపాయిని ఖర్చు చేయకుండా దాచడమూ సంపద సృష్టిలో భాగమే.

Update: 2024-08-08 02:57 GMT

సంపద సృష్టిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో పదే పదే చెప్పారు. అలా జనాలు మెచ్చి ఆయన గద్దెనెక్కారు. సంపద సృష్టించడంలో అనేక రకాలు ఉన్నాయి. ఉన్న రూపాయిని ఖర్చు చేయకుండా దాచడమూ సంపద సృష్టిలో భాగమే. బాబుకు ఇలా అనేక రకాలైన మార్గాలు తెలుసు.

ఆయన ఎక్కువగా నమ్మేది పీపీపీ విధానాన్ని. ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా దీనిని కూడా గొప్పగా టీడీపీ చెప్పుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం ప్రైవేట్ పార్టనర్ షిప్ తో అనేక కార్యక్రమాలు చేయవచ్చు అన్నది చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఏపీలోనూ రుజువు చేసింది. విభజన ఏపీలోనూ చేస్తోంది.

అయితే ఫస్ట్ టైం రోడ్ల విషయంలో పీపీపీ విధానం అమలు చేస్తున్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా ప్రజల మీద భారం పడబోతోంది అని అంటున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అలాగే డెవలప్మెంట్ యాస్పెక్ట్ లో ప్రైవేట్ పార్టనర్ షిప్ ఉన్నా దాని వల్ల కొన్ని వర్గాల మీదనే భారం పడుతుంది. కానీ రహదారులు అంటే సామాన్యుడు నుంచి సంపన్నుడి దాకా అందరూ అదే దారిలో వెళ్తారు.

దాంతో రోడ్ల విషయంలో పీపీపీ వల్ల టోల్ దెబ్బ సామాన్య జనాలకు గట్టిగా తగులుతుంది అని అంటున్నారు. ఇప్పటికే జాతీయ రోడ్లను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. దాని వల్ల టోల్ ప్లాజాల వద్ద వసూలు చేస్తూ సామన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇపుడు రాష్ట్ర రహదారులు సైతం అలా చేస్తే సగటు జీవులకు డబుల్ టోల్ దెబ్బ పడుతుందని అంటున్నారు.

ఏపీలో చూస్తే జాతీయ రహదారులు దాదాపు 8,500 కిలోమీటర్ల దాకా వుంటే రాష్ట్ర రహదారులు 12,653 కిలోమీటర్లుగా వున్నాయి. ఇక జిల్లా రహదారులు 32,725 కిలోమీటర్లుగా వున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారులుగా వున్న 8,500 కిలోమీటర్లపై వాహన యజమానులు భరించలేని రీతిలో టోల్‌ చార్జీలు వసూలు చేస్తుండగా ఇకపై రాష్ట్ర రహదారుల నిర్మాణాన్ని 12,653 కిలోమీటర్లను కూడా పిపిపి పద్దతిలో చేపట్టినట్లు అయితే వారు విధించే టోల్‌ వసూలుకు జనాలు బలి అయిపోతారు అని అంటున్నారు.

వాస్తవానికి టీడీపీ ఈ నిర్ణయం చేసింది ఇప్పుడు కాదు 2016లోనే అని అంటున్నారు. అయితే ఆనాడు ఎందుకో ఆగింది. ఇపుడు రాష్ట్రంలో రోడ్లు అన్నీ దెబ్బ తిని ఉన్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. దాంతో ప్రైవేట్ పార్టనర్ షిప్ తో ఈ రహదారుల నిర్మాణం చేపట్టాలని అనుకుంటోంది. అందులో భాగంగా వేయి కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల నిర్మాణాన్ని తొలి విడతగా పీపీపీ పద్ధతిలో చేపడతారు అని అంటున్నారు.

ఈ వేయి కిలోమీటర్ల పరిధిలో ఏకంగా పద్నాలుగు రాష్ట్ర కీలక రహదారులు ఉన్నాయి. వీటిలో పీపీపీ విధానం అమలు చేయడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ ని రోడ్లు భవనాల శాఖ రూపొందించే పనిలో పడింది. ఈ పద్నాలుగు రాష్ట్ర రహదారులు ఉమ్మడి ఏపీలోని పదమూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇవి ఇతర జిల్లాలను కలుపుతూ ఉంటాయి. దీంతో ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు వెళ్లాలన్నా టోల్ దెబ్బ పడుతుందని అంటున్నారు.

రాష్ట్ర రహదారుల విషయంలో పీపీపీ ప్రతిపాదనలు విరమించుకోవాలని విపక్షంలోని వామపక్షాలు కోరుతున్నాయి. అదే జరిగితే సామాన్యులు లారీ ఆపరేటర్లతో పాటు ఆటో డ్రైవర్లు అంతా ఇబ్బంది పడతారు అని అంటున్నారు. కానీ ప్రభుత్వం దీని మీద ముందుకే అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News