భారత్ నుంచి ఎలాన్ మస్క్ కు భారీ బ్యాడ్ న్యూస్ అందినట్లేనా?
త్వరలో తన స్టార్ లింక్ సంస్థ ద్వారా భారత్ లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఎలాన్ మస్క్ భావిస్తున్న సంగతి తెలిసిందే.
నిన్న మొన్నటి వరకూ ప్రపంచ కుభేరుడు, బిజినెస్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశం అయిన ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారారు. ఆ సంగతి అలా ఉంటే.. ఎలాన్ మస్క్ భారత్ లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తుకుంటున్న వేళ షాక్ తగిలిందని తెలుస్తోంది.
అవును... త్వరలో తన స్టార్ లింక్ సంస్థ ద్వారా భారత్ లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఎలాన్ మస్క్ భావిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ లింక్ భారత్ లోకి ఎంట్రీ ఇస్తే రిలయన్స్, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు పెద్ద సమస్యే అనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ వ్యవహార శైలిపై భారత ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... కొన్ని నెలల క్రితం మయన్మార్ స్మగ్లర్ల నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో సుమారు 6 వేల కిలోల మెథాంపెటమిన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దర్యాప్తులో స్టార్ లింక్ కు సంబంధించిన అంశాలు వెలుగు చూశాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. సముద్రయానం చేసే సమయంలో స్మగ్లర్లు మార్గం గుర్తించేందుకు వీలువా ఈ సంస్థకు చెందిన ఇంటర్నెట్ పరికరాలు వినియోగించినట్లు గుర్తించారట.
దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఈ సమయంలో... స్మగ్లర్లు వాడిన ఇంటర్నెట్ పరికరాల డేటా ఇవ్వాల్సిందిగా స్టార్ లింక్ ను భారత ప్రభుత్వం కోరింది. అయితే... అందుకు స్టార్ లింక్ నిరాకరించింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచార గోప్యతను ఈ నిరాకరణకు సాకుగా చూపించింది. దీనిపై భారత్ ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని అంటున్నారు.
వాస్తవానికి స్టార్ లింక్ సేవలు మయన్మార్ లో అందుబాటులో లేవు. అయితే... ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి సమీప దేశాల్లో మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో... భారత్ లో అక్రమ కార్యకలాపాలకు స్టార్ లింక్ పరికరాలను ఉపయోగించే అవకాశం ఉందని టెలీకమ్యునికేషన్స్ విభాగాలు, హోంమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో... స్టార్ లింక్ ను భారత్ లో అనుమతించాలంటే ఇక్కడ భద్రతకు సంబంధించి అవసరమైన కస్టమర్ డేటా మేనేజ్ మెంట్ కు ఇక్కడి నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. స్టార్ లింక్ భారత్ లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించే విషయంలో ప్రభుత్వం తటపటాయిస్తోందని తెలుస్తోంది.