షాకింగ్ సీన్: ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ను ఢీ కొన్న భాగమతి ఎక్స్ ప్రెస్
ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ లో ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీ కొంది.
ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ లో ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీ కొంది. శుక్రవారం రాత్రి తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘోర రైలు ప్రమాదంలో లక్కీగా అందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాకుంటే.. ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది.
మైసూరు నుంచి బయలుదేరిన నెంబరు 12578 భాగమతి ఎక్ప్ ప్రెస్ తమిళనాడులోని తిరుమళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్ లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా.. మరికొన్ని ఒకదానిపై మరొకటి ఎక్కిన సీన్ భీతాహవనంగా మారింది. ప్రమాదం గురించి తెలిసినంతనే చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు.. వివిధ శాఖలకు చెందిన సహాయక సిబ్బంది స్పందించారు.
ప్రమాదం గురించి తెలిసినంతనే పరుగులు తీస్తూ.. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు.. సహాయక చర్యలుచేపట్టటం అభినందనీయం. ఈ ఘోర ప్రమాదంలో ఎవరూ ప్రాణాల్ని కోల్పోలేదు.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు వేగం గంటకు 75 కి.మీ.గా ఉన్నట్లు చెబుతున్నారు. వేగం మరింత ఎక్కువగా ఉండి ఉంటే.. ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదన్న వాదన వినిపిస్తోంది.
గూడ్స్ రైలును ఢీ కొన్న వేళ.. రైలు ముందు భాగంలో అన్నీ ఏసీ కోచ్ లో ఉన్నాయి. వీటిల్లో ఉండే ప్రయాణికులు గాయపడ్డారు. వారందరిని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే.. మిగిలిన వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు సంబంధించిన సమాచారం కోసం చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151, 044 2435 4995 అధికారులు ఏర్పాటు చేశారు.