బాలకృష్ణను వరించిన పద్మభూషణ్... 'బాబాయి'కి జూ.ఎన్టీఆర్ కంగ్రాట్స్!

ఈ సమయంలో బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతుండగా.. జూ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పారు.

Update: 2025-01-25 16:59 GMT

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం "పద్మ" అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో... ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఈ సమయంలో బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతుండగా.. జూ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పారు.

అవును... దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డును కళా రంగం కేటగిరీలో బాలకృష్ణకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికం, బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు, హిందూపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.

'తాతమ్మ కల' టు 'డాకు మహారాజ్'!:

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామరావు తనయుడిగా "తాతమ్మ కల" సినిమాతో 1974వ సంవత్సరంలో సినీరంగంలోకి అడుగుపెట్టిన బాలయ్య... 14ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య.. ఇప్పటివరకూ 109 సినిమాల్లో నటించడం గమనార్హం.

రెగ్యులర్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాలలో నటించి మెప్పించిన బాలయ్యకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. కెరీర్ తొలినాళ్లలో అభిమానులతో "యువరత్న" గా పిలవబడిన బాలయ్య.. ప్రస్తుతం "గాడ్ ఆఫ్ మాసెస్" గా మారిపోయారు. బాలయ్య స్థాయిలో వెండితెరపై మాస్ డైలాగ్ చెప్పడంలో టాప్ లో నిలిచారు ఈ "టాప్ హీరో"!

ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "డాకు మహారాజ్" సినిమాతో మరోసారి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారీ హిట్ కొట్టారు. నెక్స్ట్ ‘అఖండ-2’ సిద్ధమవుతుందని చెబుతున్నారు. మరోపక్క అన్ స్టాపబుల్ అంటూ 'ఆహా' ఓటీటీలో యాంకర్ గా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు సరికొత్త బాలయ్యను పరిచయం చేశారు.. తనదైన శైలిలో అలరిస్తున్నారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే!:

అటు సినిమా ఇండస్ట్రీలో కథానాయకుడిగా సరికొత్త రికార్డులు సృష్టించి దూసుకుపోతున్న బాలకృష్ణ... ఇటు రాజకీయ రంగంలోనూ ఓటమి ఎరుగని నేతగా రాణిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీ నుంచి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన బాలయ్య.. 16,196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇక అక్కడ నుంచి రాజకీయాల్లోనూ బాలకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వైసీపీ వేవ్ గా సాగిన 2019 ఎన్నికల్లోనూ హిందుపురంలో 2014 కంటే ఎక్కువ మెజారిటీ 18,028 ఓట్లతో గెలుపొందారు. ఇదే క్రమంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి 32,597 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్!:

అలా నటనలో ‘మహారాజ్’ గా దూసుకుపోతూ, మరో వైపు రాజకీయాల్లోనూ ‘ఓటమి ఎరుగని’ నేతగా రాణిస్తూ ప్రజాసేవ చేస్తున్న బాలకృష్ణ.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గానూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. తాను పుట్టింది ప్రజలను అలరించడానికి, వారికి సేవ చేయడానికి అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ ప్రస్థానం ముందుకు సాగుతుంది!

ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం "పద్మ భూషణ్" అవార్డుకు ఎంపిక చేసింది.

బాబాయికి జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు!:

ఈ సందర్భంగా స్పందించిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) బాలయ్యకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా... ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య బాబాయికి హృదయపూర్వక అభినందనలు.. ఈ గుర్తింపు సినిమా రంగానికి మీరు చేసిన అసమానమైన సేవలకు, మీ నిర్విరామ ప్రజాసేవకు నిదర్శనం అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News