ఈసీకి బాలినేని ఫిర్యాదు.. ఈవీఎంల చెక్కింగ్ డేట్ ఫిక్స్!

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Update: 2024-08-10 04:48 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఓ వర్గం ఓటర్లలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ లను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. శకుని పాచికలతో పోల్చుతూ వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే గతంలో ఈవీఎంలపై పలు ఆరోపణలు వచ్చి ఉండొచ్చు కానీ.. అలాంటిదేమీ లేదని అనేవారూ బలంగా ఉన్నారు.

ఇలా... ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ పలు నర్మగర్భ వ్యాఖ్యలు చేయగా.. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఇది కచ్చితంగా ఈవీఎం లలో జరిగిన మోసం గానే ఫిక్సయిపోయారని అంటున్నారు. మరోపక్క... అలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేయడమే అనే మాటలూ బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజాభిప్రాయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, ప్రజాగ్రహంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఓటమిపై విశ్లేషణ జరగాలి.. అంతే తప్ప ఈవీఎం ల పనితీరును ఎత్తి చూపడం వల్ల ప్రయోజనం లేదని నొక్కి చెప్పేవారూ ఉన్నారు. ఆ సంగతి అలా ఉంటే... పలువురు వైసీపీ నేతలు ఈవీఎంల పెర్ఫార్మెన్స్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అందుకు ఈసీ అంగీకారం తెలిపింది.

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈవీఎంల పరిశీలనపై అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ వివరాలు కలెక్టర్ వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజినీర్లతో డమ్మీ బ్యాలెట్ లు ఏర్పాటు చేసి, ఫిర్యాదు చేసినవారికి చూపించనున్నట్లు తెలిపారు. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన మాత్రమే జరుగుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో... ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News