'జగన్ ఐపీఎస్'లు ఏమయ్యారో తెలుసుగా: బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
ఆనాడు అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌లు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంటికి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు బాల్కసుమన్.. ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. జగన్ పరిపాలనలో ఆయనకు విధేయులుగా పనిచేసిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఇప్పుడు ఏమైందో మీకు తెలుసుగా! అంటూ తెలంగాణ ఐపీఎస్ అధికారులను ఆయన ప్రశ్నించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ''జగన్ అడుగులకు మడుగులు అద్దిన ఐపీఎస్‌లు ఏమయ్యారో తెలుసుగా'' అని అన్నారు. ఆనాడు అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌లు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంటికి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
జగన్ హయాంలో చేసిన తప్పులకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నారని బాల్క వ్యాఖ్యానించారు. చెన్నూరులో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి సూట్ కేసు కంపెనీలకు లాండరింగ్ పద్దతిలో డబ్బులు పంపించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివేక్ జైలుపాలవడం ఖాయమని జోస్యం చెప్పారు. వివేక్‌ను ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నంలో ఉన్నారని, కానీ.. దేవుడే దిగివచ్చినా వివేక్ ను ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానిం చారు. వివేక్ వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
అయితే.. సీఎం కనుసన్నల్లో కొందరు ఐపీఎస్‌లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. అవసరమై తే.. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని తేల్చి చెప్పారు. ``తెలంగాణ పోలీసులకు స్వామిభక్తి ఎక్కువైంది. సీఎం రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏపీలోనూ ఇలానే చేశారు. జగన్ అడుగులకు మడుగులు అద్దిన ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. చంద్రబాబు వచ్చాక ఇంటికి వెళ్లారు. కేసులు ఎదుర్కొంటున్నారు`` అని సుమన్ వ్యాఖ్యానించారు.