బండారుకి తీవ్ర అస్వస్థత....టికెట్ రాక మనస్థాపం...!
అయితే రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బండారుకి ఒక్క సారిగా సుగర్ లెవెల్స్ పడిపోయాయి. దాంతో పాటుగా ఆయనకు రక్త పోటు పెరిగింది.
దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెంటనే తరలించారు. బండారుకు అక్కడ చికిత్స సాగుతోంది. అయితే రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బండారు ఇటీవల కాలంలో మానసికంగా వత్తిడికి గురి అయ్యారని తెలుస్తోంది.
ఆయన పెందుర్తి అసెంబ్లీ టికెట్ ని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ ఆయనకు దక్కలేదు. జనసేన నేత పంచకర్ల రమేష్ బాబుకు ఆ టికెట్ ని కేటాయించారు. అయితే తనకు టికెట్ ఇవ్వాలని పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను అని బండారు అధినాయకత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే టికెట్ మాత్రం జనసేనకు ఖరారు కావడం జరిగిపోయింది.
ఇక టికెట్ దక్కదు అన్నది తెలిసిన మీదట బండారు అనుచరులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే టైం లో వారంతా కూడా బండారు తోనే తాము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉంటామని అంటున్నారు. ఒక వైపు అనుచరుల వత్తిడి మరో వైపు అధినాయకత్వం ఉదాశీనత ఇవన్నీ బండారులో ఒక్కసారిగా వత్తిని పెంచేశాయి.
ఆయన గత కొద్ది రోజులుగా అసలు బయటకు రావడంలేదు. ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు. దాంతో ఆయన మానసికంగా కూడా నలిగిపోతున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో బండారు అనారోగ్యం పాలు అయ్యారు. ఇదిలా ఉంటే బండారు గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈసారి టికెట్ ఖాయమని ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ కనుక తనకు దక్కితే కచ్చితంగా గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన సీనియర్ నేత. మరోసారి మంత్రి కావాలని ఆ విధంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసుడు అప్పలనాయుడుకు చాన్స్ ఇవ్వాలని చూసారు. ఇపుడు ఆయనకు టికెట్ దక్కక పోవడంతో రాజకీయ తెర మీద నుంచి బండారు కుటుంబం కనుమరుగు అవుతుంది అన్న ఆందోళన ఆయనతో పాటు అనుచరులలో ఎక్కువ అయింది.
ఇంకో వైపు చూస్తే అధినాయకత్వం నుంచి సరైన హామీ కూడా దక్కలేదు అని అంటున్నారు. ఈ పరిణామాలే ఆయన హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలు కావడానికి కారణం అంటున్నారు. మరో వైపు చూస్తే పెందుర్తి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆయనకు అనకాపల్లి నుంచి చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. దీని మీద కూడా అనుచరుల వత్తిడి ఉందని అంటున్నారు.