‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీకి పన్నురాయితీ.. బండి డిమాండ్

ఇప్పుడు అలాంటి తీరులోనే ఉన్న చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ మూవీని తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లో వీక్షించారు.

Update: 2024-11-23 05:11 GMT

సంచలన అంశాలకు సంబంధించి నిర్మించే కొన్ని సినిమాలు ప్రొడక్షన్ వేళలో కామ్ గా తమ పని తాము చేసుకుంటూ పోతాయి. వాటికి పెద్ద ప్రచారం కూడా ఉండదు. ఒకసారి సినిమా నిర్మాణం పూర్తై విడుదలకు ముందు ఒక్కసారిగా చర్చకు రావటమే కాదు.. హాట్ టాపిక్ గా మారుతుంటాయి. వాటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు అలాంటి తీరులోనే ఉన్న చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ మూవీని తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లో వీక్షించారు.

ఇంతకూ ఈ సినిమా కథాంశం ఏమిటన్న విషయంలోకి వెళితే.. పెను సంచలనంగా మారిన గోద్రా సంఘటనలకు సంబంధించిన అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ఒక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్న బండి సంజయ్.. ‘కాంగ్రెస్ పార్టీ మన దేశ చరిత్రను వక్రీకరించింది. వాస్తవాల్ని తెరమరుగు చేసే ప్రయత్నం చేసింది. ఇందుకు గోద్రా ఘటనే నిదర్శనం. దేశంలో మత విద్వేషాలు క్రియేట్ చేసి రాజకీయ లబ్థి పొందాలని చూసింది. గోద్రా రైలు నిప్పు పెట్టిన ఉదంతం కరసేవకుల హత్యకు పన్నిన కుట్రగా బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉంది’ అంటూ తన వాదనలను వినిపించారు.

అయితే.. ఇప్పటికీ అసలు నిజాలు బయటకు రాకుండా కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన.. సమాజంలోని వాస్తవాల్ని వెలికితీసేలా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలన్న ఆయన.. ఈ సినిమాకు పన్ను రాయితీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాను ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు చూడటం..దీనికి అనుకూలంగా మాట్లాడటం తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే.. ది సబర్మతీ రిపోర్ట్ మూవీని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వాలంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒకటి తర్వాత ఒకటి చొప్పున డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. హర్యానా.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్.. మధ్యప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇప్పటికే ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాయి.

Tags:    

Similar News