తొలిసారిగా కేంద్ర మంత్రి... బండి సంజయ్ ఏం చేశారో తెలుసా?
ఈ సమయంలోనే కరీంనగర్ టౌన్ లోకి అడుగుపెట్టిన అనంతరం బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేశారు.
బీజేపీ నేతల్లో మోడీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన బండి సంజయ్.. ఇటీవల కేంద్ర మంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గతంలో ఈయన టీ బీజేపీ చీఫ్ గానూ కీలక భూమిక పోషించారు.
ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో... తొలిసారి తన సొంత నియోజకవర్గం కరీంనగర్ కు వచ్చారు. ఇలా కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి సందర్శించిన బండి సంజయ్... కరీంనగర్ పట్టణంలో నేలపై పడుకుని స్థానిక నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు.
దీంతో... అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోడీలాగా వ్యవహరించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో... 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో... నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనం ముందు నమస్కారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ విషయాన్ని బీజేపీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కాగా.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్... ఈనెల 8వ తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తొలిసారి కేంద్ర మంత్రిగా సంజయ్ తెలంగాణకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం కరీంనగర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలోనే కరీంనగర్ టౌన్ లోకి అడుగుపెట్టిన అనంతరం బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన బండి సంజయ్... "సెల్యూట్ తెలంగాణ.. సెల్యూట్ కరీంనగర్" అని అన్నారు. అనంతరం... తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని.. కరీంనగర్ అభివృద్ధికి శ్రమించి పని చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో... స్థానిక కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటానని.. అందరినీ కలుపుకుని కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.