హిందూ యువతితో తిరుగుతున్నాడని దారుణం!
వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముంబైలోని బాంద్రా టెర్మినస్ వద్ద హిందూ యువతితో బయటకు వెళ్లినందుకు ఒక ముస్లిం యువకుడిపై ఒక గుంపు దాడి చేసింది.
By: Tupaki Desk | 17 Aug 2023 3:30 PM GMTదేశం సాంకేతికంగా ఆధునికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా కొంతమంది వ్యక్తులు మారడం లేదు. కులాన్నో, మతాన్నో సావకాశంగా తీసుకుని మూక దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కలకలం సృష్టించింది. 16 ఏళ్ల హిందూ యువతితో బయట తిరుగుతున్నాడని ఒక ముస్లిం యువకుడిపై ఒక గుంపు దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి కొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముంబైలోని బాంద్రా టెర్మినస్ వద్ద హిందూ యువతితో బయటకు వెళ్లినందుకు ఒక ముస్లిం యువకుడిపై ఒక గుంపు దాడి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తిని పదే పదే చెప్పుతో కొట్టిన దృశ్యాలు ఉన్నాయి. మూక దాడి చేసినప్పుడు.. ఆ అమ్మాయి.. 'అతన్ని కొట్టవద్దు' అని వేడుకుంది. అయినా వారు ఆ యువకుడిని విడిచిపెట్టలేదు.
యువకుడిపై దాడి చేస్తున్నప్పుడు గుంపులో ఉన్న మరికొందరు ఈ సంఘటన వీడియోలను కూడా తీశారు. అలాగే వారు అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని బాధితుడికి చెప్పడం కూడా ఆ వీడియోలో వినపడుతోంది. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని రైల్వే స్టేషన్ బయటికి ఈడ్చుకెళ్లారు.
దుండగులు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేస్తూ ఆ యువకుడి జుట్టు, కాలర్ పట్టుకుని బయటకు లాగారు. అలాగే.. 'మేము ఈ రోజు బాంద్రా టెర్మినస్ లో ఒక మైనర్ హిందూ బాలికను రక్షించాం' అని గుంపులో ఉన్న ఒక వ్యక్తి మాటలు కూడా ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.
ఈ వీడియోను ఎవరో ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాకుండా ముంబై పోలీసులకు, రైల్వే పోలీస్ ఫోర్స్ ముంబై సెంట్రల్ డివిజన్ లకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. అయితే ఈ ఘటనపై ముంబై పోలీసులు ఇంకా స్పందించలేదు. అయితే ఆర్‌పీఎఫ్ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించారు.
మరోవైపు ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ట్విట్టర్ లో ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్లు తనకు సమాచారం అందిందని పఠాన్ పేర్కొన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.