సూసైడ్ చేసుకున్న టెకీ కొడుకు తల్లివద్దే.. తేల్చిన సుప్రీం

బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి వినతి నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న.. జస్టిస్ ఎస్ సీ శర్మలు.. ఆన్ లైన్ వీడియో ద్వారా మాట్లాడారు.

Update: 2025-01-21 05:30 GMT

దేశ వ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసిన బెంగళూరు టెకీ ఆత్మహత్య గురించి తెలిసిందే. భార్య పెట్టే వేధింపులకు తాళలేకపోతున్నట్లుగా పేజీల కొద్దీ వేదనను షేర్ చేసి.. వీడియోను సైతం రికార్డు చేసిన అతుల్ సుభాష్ ఉదంతం గుర్తుందా? తన ఆత్మహత్యకు ముందు తన నాలుగేళ్ల కొడుకును తన తల్లి దగ్గర ఉంచాలని.. భార్య నిఖితా సింఘానియా నుంచి వేరు చేయాలని కోరారు. టెకీ ఆత్మహత్య అనంతరం పిల్లాడి సంరక్షణ బాధ్యతలపై అతుల్ లల్లి అంజు దేవి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆదేశాల్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వెలువరించింది. దీనికి ముందు.. సుప్రీం విచారణలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి వినతి నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న.. జస్టిస్ ఎస్ సీ శర్మలు.. ఆన్ లైన్ వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు. విచారణ వేళ.. అతుల్ సుభాష్ కొడుకును జడ్జిలకు చూపించేందుకు నిఖితా సింఘానియా ఒప్పుకోలేదు. దీనిపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ నాగరతన మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్ గా చెప్పి.. ఆ పిల్లాడ్ని తాము చూడాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

వెంటనే పిల్లాడ్ని తమకు చూపించాలని.. బాలుడిని విచారణ చేపట్టిన తర్వాత తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింకులో తెర మీదకు వచ్చాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కొడుకుతో మాట్లాడారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు తన విచారణను ఆఫ్ లైన్ చేసింది. బాలుడితో మాట్లాడిన తర్వాత.. నాలుగేళ్ల కొడుకు నానమ్మ దగ్గర కాకుండా తల్లి దగ్గరే ఉండేందుకు సుప్రీం ధర్మాసనం ఆదేశాల్నిజారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ సుభాష్.. నిఖితలు 2019లో పెళ్లి చేసుకోవటం.. ఆ జంటకు బెంగళూరులో తమ ఉద్యోగాల్లో చేరారు. తర్వాతి ఏడాది వారికో బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులో భర్తను విడిచి పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త.. అతని కుటుంబంపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు విచారణ కోసం అతుల్ భార్య స్వస్తలానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో మానసికంగా.. శారీరకంగా అలిసిపోయిన అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు పేజీల కొద్దీ ఆత్మహత్య నోట్ రాయటంతో పాటు వీడియో కూడా షూట్ చేసుకొని తన భార్య తనను ఎంతలా వేధింపులకు గురి చేసిందో చెప్పుకున్నారు. ఆత్మహత్య నేపథ్యంలో అతుల్ రాసిన సూసైడ్ నోట్.. వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News