సైఫ్ పై దాడి కేసులో బంగ్లాదేశ్ పౌరుడు అరెస్ట్... షాకింగ్ విషయాలు!
ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డగా.. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.
ఈ నెల 16 గురువారం తెల్లవారుజామున తన నివాసంలో నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తి, బ్లేడ్ లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డగా.. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారు కాదని నిర్ధారించుకున్న అనంతరం వదిలేసిన పోలీసులు తాజాగా అసలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అవును... జనవరి 16న తన నివాసంలో సైఫ్ పై కత్తితో ఆరు చోట్ల గాయాలు చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా పోలీసులు సుమారు 30 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సమయంలో ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30) అని చెబుతున్నారు. ఇతడు థానేలోని హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడని చెబుతున్నారు. ఇతడు నగరంలోని హీరానందనీ ఎస్టేట్ లోని మెట్రో నిర్మాణ స్థలం సమీపంలోని లేబర్ క్యాంపులో సైఫ్ నివాసానికి 35 కిమీ దూరంలో అరెస్టైనట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో... సైఫ్ ఇంట్లోకి చోరీ ఉద్దేశ్యంతోనే ప్రవేశించి, నేరం చేసినట్లు అతడు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అతడిని జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ముంబై పోలీస్ అధికారి దీక్షిత్ గెడమ్... అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు అతడు బంగ్లాదేశ్ జాతీయుడని సూచిస్తున్నాయని తెలిపారు.
ఈ క్రమంలో అతడు సుమారు ఐదారు నెలల క్రితమే భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి ముంబైకి చేరుకున్నాడని అన్నారు. ఇతడికి విజయ్ దాస్, బీజే, బిజోయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ మొదలైన అనేక పేర్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇతడు గత ఐదారునెలల్లో ముంబై, థానేలలో పలు ప్రాంతాల్లో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.
సైఫ్ కోలుకుంటున్నాడు!:
మరోపక్క సైఫ్ అలీఖాన్ కు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా.. సైఫ్ కోలుకుంటున్నాడని.. ఇప్పటికే ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి మార్చామని.. ప్రస్తుతం నడుస్తున్నారని.. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని.. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని లీలావతి హాస్పటల్ లోని న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు.