బ్రిటన్ వద్దంటోంది.. బంగ్లా అప్పగించమంటోంది.. భారత్ లోనే కొన్నాళ్లు హసీనా

కానీ, అక్కడినుంచి అనుమతి రాకపోవడంతో భారత్ ను శరణు కోరారు. మరిప్పుడు బ్రిటన్ ఏమంటోంది?

Update: 2024-08-07 07:43 GMT

కేవలం గంటలోపలే మాజీ ప్రధానిగా మారిపోయి సొంతగడ్డ బంగ్లాదేశ్ ను వీడిన షేక్ హసీనా ఎక్కడికి వెళ్తారు..? అన్ని వర్గాల వారిని తన దగ్గర ఉండనిచ్చే బ్రిటన్ లోనా? లేక ఆపద్ధర్మంగా వచ్చిన భారత్ లోనా..? ఇప్పటికే దాదాపు రెండు రోజులు అవుతోంది హసీనా ఢిల్లీకి వచ్చి.. ఆమె షాక్ లో ఉన్నారని, కోలుకున్నాక మాట్లాడతామని, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలుసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి లండన్ వెళ్లేందుకు తొలుత హసీనా ప్రయత్నించారు. కానీ, అక్కడినుంచి అనుమతి రాకపోవడంతో భారత్ ను శరణు కోరారు. మరిప్పుడు బ్రిటన్ ఏమంటోంది?

అసలే వివాదాల్లో బ్రిటన్

ఒకప్పుడు వివాదాస్పదంగా పదవులు దిగిపోయిన అందరు నేతలకు ఆశ్రయం ఇచ్చిన బ్రిటన్.. హసీనాను మాత్రం చేర్చుకునే పరిస్థితుల్లో లేనట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆ దేశంలో తాజాగా వర్ణం ప్రకారంగా దాడులు జరుగుతున్నాయి. ఇవేకాక మరే కారణాలతోనో హసీనాను బ్రిటన్ రానీయడం లేదు. దీంతో ఆమె ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నారు. అప్పటివరకు భారత్‌ ఆమెకు ఇల్లు కానుంది. గమనార్హం ఏమంటే.. షేక్‌ రెహానాతో కలిసి హసీనా ఢిల్లీ చేరుకున్నారు. 1975లో తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులను కోల్పోయిన వీరిద్దరూ ఆరేళ్లు భారత్ లోనే ఉన్నారు. ఇక బ్రిటన్ దోబూచులాడుతోంది. తమ దగ్గరకు వచ్చినా.. బంగ్లాలో హింసాకాండకు బాధ్యురాలిగా హసీనాపై విచారణ జరిగితే ఆమెను అప్పగించేస్తామని తేల్చిచెబుతోంది. హింసపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలని కోరుతోంది. కాగా, రెహానాకు బ్రిటన్‌ పౌరసత్వముంది. ఈమె కూతురు తులిప్‌ సిద్దిఖ్‌ బ్రిటన్‌లో ఎంపీ కావడం గమనార్హం.

గల్ఫ్ దేశాలకు వెళ్తారా?

గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియాతో పాటు బెలారస్‌ వెళ్లేందుకు ఉన్న అవకాశాలను హసీనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమె కుటుంబ సభ్యులు ఫిన్లాండ్‌ లో ఉండడంతో ఆ దేశం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. హసీనా, రెహానా ఢిల్లీలోనే రహస్య ప్రాంతంలో ఉన్నారు.

రాజీనామాకు ముందు పెద్ద డ్రామా..

అకస్మాత్తుగా సోమవారం హసీనా రాజీనామాకు ముందు ఏం జరిగింది..? పెద్ద డ్రామానే నడిచిందని తెలుస్తోంది. ఆ రోజు ఉదయం అధికారిక నివాసంలో త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులతో భేటీ అయిన హసీనా.. ఆందోళనలను అడ్డుకోలేకపోతుండడంపై మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దాలని కోరగా.. ఆ దశ ఎప్పుడో దాటిపోయిందని వారు బదులిచ్చారు. రాజీనామా చేయాలని 4 గంటల పాటు ప్రయత్నించి ఒప్పించారు. ఇదే ఉత్తమ మార్గం అని రెహానాతో కూడా చెప్పించారు. మరోవైపు బయట.. విద్యార్థులు, యువకులు కర్ఫ్యూను ధిక్కరించి ప్రధాని అధికార నివాసం ముట్టడికి పూనుకున్నారు. కనీవినీ ఎరగని విధంగా ఢాకా వీధుల్లో పోటెత్తారు. ‘పరిస్థితి చేయి దాటుతోంది. గంటలోపే జనం వచ్చిపడొచ్చు. 45 నిమిషాల్లో అంతా సర్దుకుని వెళ్లిపొండి’ అని హసీనాకు సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మొదట అంగీకరించకున్నా.. విదేశాల్లో ఉన్న కుమారుడు కూడా ఫోన్లో అదే మాట చెప్పడంతో హసీనా కదిలారు. ప్రజలనుద్దేశించి మాట్లాడతానని కోరినా, అంత సమయం లేదనడంతో భారంగా నిష్ర్కమించారు. ఇంటి ఆవరణలో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌ లో ఎక్కి అధ్యక్ష నివాసం చేరుకుని రాజీనామా సమర్పించారు. అక్కడినుంచి విమానాశ్రయానికి వచ్చారు. సైనిక విమానంలో భారత్ కు వచ్చారు.

అమెను మాకు అప్పగించండి..

హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్పీ) సంయుక్త కార్యదర్శి, సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ ను కోరారు. రెహానాను కూడా అప్పగించాలని విన్నవించాడు. బార్ అసోసియేషన్ ఆడిటోరియంలో అతడు మీడియాతో మాట్లాడాడు. భారత్‌ తో స్నేహం కోరుకుంటున్నామని అంటూనే.. పారిపోయి విదేశంలో తలదాచుకుంటున్న హసీనాను అరెస్ట్‌ చేసి తమకు అప్పగించాలనడం గమనార్హం. అమాయకుల మరణానికి హసీనానే కారణమని ఆరోపించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలని, వారం పది రోజుల్లో సుప్రీం కోర్టు న్యాయవాదులు రాజీనామా చేసి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కూడా కోరడం గమనార్హం.

Tags:    

Similar News