ఆన్సర్ షీట్ లో వార్నింగ్... మార్కులు వేయకపోతే చేతబడే!
తాజాగా జవాబు పత్రంలో ఒక బెదిరింపులు దిగాడు హైస్కూల్ విద్యార్థి. అందులో భాగంగా... తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తానని బెదిరించాడు!
కొంతమంది ఆకతాయిలు పరీక్షల్లో వారు రాసిన జవాబు పత్రాల్లో కరెన్సీని పెట్టి.. పరీక్ష పత్రాల మూల్యాంకనం చేసే టీచర్లను లోబరుచుకునే ప్రయత్నం చేస్తుంటారని.. మరికొంతమంది తమ కష్టాలు రాసి కన్వెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారని.. మొదలైన విషయాలు చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయని అంటుంటారు! ఈ సమయంలో.. తాజాగా బ్లాక్ మ్యాజిక్ బెదిరింపులకు దిగాడో హైస్కూలు విద్యార్థి!
అవును... తనపై తనకు నమ్మకం లేదో.. లేక, తాను రాసినవన్నీ తప్పుడు సమాధానాలని భావించాడో.. అదీగాక అంతకంటే ఎక్కువ మార్కులు రావాలని భావించాడో తెలియదు కానీ.. తాజాగా జవాబు పత్రంలో ఒక బెదిరింపులు దిగాడు హైస్కూల్ విద్యార్థి. అందులో భాగంగా... తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తానని బెదిరించాడు! దీంతో.. ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
వివరాళ్లోకి వెళ్తే... బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పదోతరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. ఈ క్రమంలో... తెలుగు పేపర్ లో "రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి" అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా బెదిరింపులకు దిగాడు! ఇందులో భాగంగా... "నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా" అని రాశాడు.
దీంతో... అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. వెంటనే ఆ జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... సదరు విద్యార్థికి వందకు 70 మార్కులు వచ్చాయి! దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.