తూచ్.. ఆ అమెరికా అధ్యక్ష దంపతులు విడిపోవట్లేదోచ్
రెండుసార్లు వరుసగా అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయకులు తక్కువ.
మరొక్క రెండు రోజుల్లో అమెరికాలో కొత్త అధ్యక్షుడి పాలన ప్రారంభం కానుండగా.. సంచలన కథనాలు వచ్చాయి.. అదేదో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపు.. ఉక్రెయిన్ పై మూడేళ్లుగా యుద్ధం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలో కాదు.. ఎనిమిదేళ్ల కిందటే అధికారం నుంచి తప్పుకొన్న అధ్యక్షుడి సంసారం గురించి కావడం గమనార్హం.
రెండుసార్లు వరుసగా అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయకులు తక్కువ. వారిలో ఒకరు బరాక్ ఒబామా. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన 2008-2016 మధ్య 8 ఏళ్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఒబామా అత్యంత పాపులర్ నాయకుడు. కాగా, ఆయనతో పాటు భార్య మిచెల్ ఒబామా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు పిల్లలతో కూడిన విద్యావంతులైన వీరి జంటను చూసి అందరూ ముచ్చటపడేవారు.
కాగా, పదవి నుంచి దిగిపోయాక సైతం జంటగా కనిపించే ఒబామా దంపతులు ఇటీవల దూరంగా ఉంటున్నారన్న కథనాలు వచ్చాయి. మిచెల్ భర్తతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో వీటికి మరింత బలం చేకూరింది. అన్నిటికి మించి ఒబామా దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు వ్యాపించాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా వార్తల్లో నిలిచిన జిమ్మీ కార్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు ఒబామాతో కలిసి మిచెల్ పాల్గొనలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా మిచెల్ హాజరు కావడం లేదని తెలియడంతో వీరు కచ్చితంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కాగా, వీటిని శుక్రవారమే మిచెల్ టీమ్ ఖండించిది. అందుబాటులో లేకనే కార్టర్ అంత్యక్రియల్లో పాల్గొనలేదని, ట్రంప్ తీరు నచ్చక ఆయన ప్రమాణంలో పాల్గొనడం లేదని చెప్పింది.
ఫొటోతో క్లారిటీ వచ్చేసినట్లేనా..?
తాజాగా ఒబామా సైతం క్లారిటీ ఇచ్చారు. లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ మిచెల్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. విడాకుల ఊహాగానాల మధ్య ఒబామా తొలి స్పందన ఇదే కావడం గమనార్హం. పైగా శుక్రవారం మిచెల్ పుట్టిన రోజు. ఆమెను డిన్నర్ కు తీసుకెళ్లి ఆ ఫొటోను షేర్ చేశారు. నా జీవితాన్ని ప్రేమతో నింపిన నా ప్రేయసి అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో ప్రతి సందర్భాన్ని నీ వెచ్చదనం, జ్ఞానం, హాస్యంతో నింపావు. నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషకరం’’ అని ఒబామా స్పష్టం చేశారు. దీంతో విడాకుల ఊహాగానాలకు తెరపడింది.