బర్రెలక్క 60 వేలు.. కేసీఆర్ 3 వేలే.. మరీ ఇంత వెనుకబాటా?

బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ నామినేషన్ పత్రాలను రికార్డు స్థాయిలో 60 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట.

Update: 2023-11-28 10:59 GMT

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశం బర్రెలక్క అలియాస్ శిరీష. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమెకు కొన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు దక్కుతోంది. రెండేళ్ల కిందట ఉద్యోగ నియామకాలు లేక బర్రెలు కాస్తున్నానని పేర్కొంటూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటినుంచి శిరీషను బర్రెలక్కగా పిలవడం మొదలుపెట్టారు. బర్రెలు కాసుకుంటూ "హాయ్ ఫ్రెండ్స్" అంటూ చేసిన వీడియో.. చివరకు ఆమెను ఎన్నికల బరిలోకి దించాయి. తెలంగాణలో నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీషను చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో?

మారుమూల కొల్లాపూర్ నుంచి..

తెలంగాణలో మారుమూల నియోజకవర్గం కొల్లాపూర్. క్రిష్ణా నది ఒడ్డున ఉండే ఈ నియోజకవర్గం ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంలో ఉండేది. ప్రస్తుతం ఆ ప్రభావం నుంచి బయటపడినా.. కొల్లాపూర్ రాజకీయంగా సంచలమైనదే. ఇక్కడి మొదటినుంచి కాంగ్రెస్, టీడీపీల మధ్యనే పోరు. అలాంటిది 2010లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జూపల్లి క్రిష్ణారావు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. నాడు జరిగిన ఉప ఎన్నికలో, 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడారు. అయితే, అదే అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరడంతో జూపల్లికి ప్రాధాన్యం లేకుండా పోయింది. చివరకు ఆరు నెలల కిందట జూపల్లి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీలో నిలిచారు. హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్యన బర్రెలక్క శిరీష నిలవడం విశేషం.

నామినేషన్ డౌన్ లోడ్ లలో రికార్డు

బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ నామినేషన్ పత్రాలను రికార్డు స్థాయిలో 60 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. అందులో ఆమె ఏమేం వివరాలు పేర్కొన్నారో చూద్దామని ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి శిరీష దూర విద్యలో డిగ్రీ చదివారు. తెలంగాణ లో పోటీ పరీక్షలు నిర్వహించడం లేదంటూ, తాను బర్రెలు కాస్తున్నానంటూ చేసిన వీడియో అనంతరం ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ వీడియోలో చూపిన బర్రెలు కూడా లేవట. చేతిలో రూ.6,500 నగదు మాత్రమే ఉందని అఫిడవిట్ లో పేర్కొంది. మరోవైపు నామినేషన్ వేసిన మొదట్లోనే బర్రెలక్క పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు కొందరు. కొల్లాపూర్ లోని ఇతర అభ్యర్థుల నామినేషన్లను 7 వేల మంది డౌన్ లోడ్ చేసుకుంటే..ఈ నెల 24 నాటికే బర్రలక్క నామినేషన్ ను 30 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట.

కేసీఆర్ ను ఓడించింది

సోమవారం నాటికి శిరీష నామినేషన్ ను 60 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒకరంగా రికార్డే. అసలు ఊరుపేరు లేని అభ్యర్థి నామినేషన్ లో ఏముందో తెలుసుకునేందుకు ఇంతమంది ఆసక్తి చూపడం ఏమిటనేది చర్చనీయాంశమే. కాగా, ఈ విషయంలో బర్రెలక్క.. సీఎం కేసీఆర్ ను ఓడించింది. గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. నామినేషన్ ను 3 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారట. అయితే.. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఉద్ధండులు. ఆయన చరిత్రంతా అందరికీ తెలిసిందే. నామినేషన్ లో కొత్తగా తెలుసుకునేది ఏమీలేదు. అందుకే ఎక్కువ డౌన్ లోడ్ లు లేవని సమర్థిస్తున్నారు కొందరు. ఏది ఏమైనా బర్రెలక్క.. సీఎం కేసీఆర్ ను ఓడించింది.

Tags:    

Similar News