మోడీ ఒక యోగి...బీజేపీ క్రిష్ణయ్య కితాబు
ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు ఆయనను ఒక యోగిగా క్రిష్ణయ్య అభివర్ణించారు.
బీసీ క్రిష్ణయ్య బీజేపీ క్రిష్ణయ్యగా మారిన తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలసి ఒక బహిరంగ సభలో పాలు పంచుకోబోతున్నారు. ఆ సభ ఏపీలోని విశాఖలో జరుగుతోంది. నెల రోజుల క్రితం క్రిష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా గెలిచారు. అలా ఆయన మరోమారు పెద్దల సభలో అడుగుపెట్టారు.
ఆయన 2022లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే రెండెళ్ళకే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఏమిటిది అనుకున్నారు అంతా. తాను బీసీల కోసం పోరాటం చేస్తానని ఆయన రాజీనామా తరువాత చెప్పారు. బీసీ నేతగా అర్ధ శతాబ్దంగా సాగిస్తున్న తన ఉద్యమానికి ఇక మీదట కూడా అంకితం అవుతాను అన్నారు.
కట్ చేస్తే బీజేపీ కండువా ఆయన కప్పుకున్నారు. బీజేపీలో చేరడానికి తిరిగి అదే సీటుని దక్కించుకోవడానికి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకున్న మీదటనే క్రిష్ణయ్య వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారని దానిని బట్టి అంతా అనుకున్నారు. మరో వైపు చూస్తే క్రిష్ణయ్య బీజేపీ ఎంపీ అయ్యాక మోడీ పాల్గొనే భారీ సభ కోసం ఒక రోజు ముందే విశాఖ చేరుకున్నారు
ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు ఆయనను ఒక యోగిగా క్రిష్ణయ్య అభివర్ణించారు. ఆయన దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. దేశం మొత్తం గర్వించే ప్రధానిగా మోడీ ఉన్నారని ఆయన పాలనలో ఎన్నో సంస్కరణలు అమలు చేసి చూపించారు అని అన్నారు.
దేశంలో చూసుకుంటే 76 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో మోడీ పాలన ఒక మైలురాయి వంటిదని క్రిష్ణయ్య అన్నారు. ఈ రోజున దేశం వ్యవసాయికంగా సాంకేతికంగా ఆర్ధికంగా పురోభివృద్ది సాధిస్తోందంటే మోడీ ఘనతగా చెప్పాలని ఆయన ప్రశంసించారు.
పనిలో పనిగా ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషి ఎన్నతగినదని అన్నారు. కూటమి ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రభుత్వమని క్రిష్ణయ్య వ్యాఖ్యానించారు.
మొత్తం మీద చూస్తే బీసీ నేత రాజ్యసభ సభ్యుడు క్రిష్ణయ్య విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ దేశానికి మోడీ తప్ప మరో నాయకుడు ఎవరూ లేరని కీర్తించడం విశేషం. బీజేపీ ఎంపీగా ఆయన మోడీని ఆకాశానికి ఎత్తేయడం సమంజసమే అని అంటున్నారు. ఒకనాడు బీసీలకు పాలకులు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. ఇపుడు బీజేపీ బీసీలకు మరింత మేలు చేసేలా ఆయన చూడాలని అంటున్నారు.