16 ఏళ్లు గడిచినా వీడని మిస్టరీ.. బెనజీర్ ను చంపిందెవరు?

ఈ అంశంలో అత్యంత దారుణమైన విషయం ఏమంటే.. బెనజీర్ ను హత్య చేసిన 16 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఆమెను హత్య చేసింది ఎవరన్న అంశంపై స్పష్టత లేదు.

Update: 2023-12-28 07:30 GMT

ఆమె సాదాసీదా యువతి కాదు. పాకిస్తాన్ లాంటి దేశంలో దేశ ప్రజల మనసుల్ని గెలుచుకొని ఆ దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. అయితే.. సైన్యం చేసిన పనికి తన పదవిని కోల్పోయినా.. ఆమె నిరాశకు గురి కాలేదు. పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో అధికార పగ్గాల కోసం ఆమె చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మరోసారి పాక్ ప్రధానమంత్రిగా ఎన్నిక కావటానికి ప్రయత్నిస్తున్న వేళ.. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమెను అత్యంత దారుణంగా.. అమానుషంగా హత్య చేశారు.

అయితే.. ఈ అంశంలో అత్యంత దారుణమైన విషయం ఏమంటే.. బెనజీర్ ను హత్య చేసిన 16 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఆమెను హత్య చేసింది ఎవరన్న అంశంపై స్పష్టత లేదు. అనుమానితుల జాబితాను సరైన రీతిలో ప్లాన్ చేస్తే.. పట్టుకోవటం అంత కష్టమైన పని కాదు. అయినప్పటికీ ఈ చిన్న విషయాన్ని ఆ దేశంలోని నిఘా అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఉంటే.. హత్య కేసు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చి ఉండేదన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

2007 డిసెంబరు 27న రావాల్పిండిలో ఎన్నికల సభలో పాల్గొన్న ఆమె.. సరిగ్గా బయలుదేరే టైంలో లియాఖత్ బాగ్ బయట బెనజరీ భుట్టోపై హత్యాయత్నం జరగటం.. ఆ దాడిలో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె హత్యకు గురైన సమయంలో బెనజీర్ భుట్టో వయసు 54ఏళ్లు. ఆ టైంలో సైనియ నియంత పర్వేజ్ ముషారఫ్ పాలనలో పాకిస్థాన్ నడుస్తోంది.

2007లో ఆమె హత్యకు గురైన తర్వాత.. 2008 నుంచి 2013 వరకు బెనజీర్ ప్రాతినిధ్యం వహించే పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ.. బెనజీరీ భుట్టోను హత్య గుట్టును రట్టు చేయటంలో ఫెయిల్ అయిన పరిస్థితి. రోజులు గడిచే కొద్దీ.. ఆమె మీద ఆరోపణలు చేసే అంశాలకు సంబంధించిన ఆధారాలు వేటిని గుర్తించలేని దుస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ సందేహాలు ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఆమె హత్యోదంతంలో కీలకమైన అంశాల్లో ఒకటి.. ఆమె నిర్వహించిన ర్యాలీ ముగిసిన తర్వాత ఆమె ప్రయాణించే మార్గాన్ని మార్చటం.. హత్య జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని అధికారులు హడావుడిగా కడిగేయటం.. స్థానిక అధికారరులు భయాందోళనలకు గురి కావటం లాంటివి చెప్పాలి. ఇక.. బెనజీర్ భుట్టో హత్యను ఉగ్రఘటనగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల టెలిఫోన్ సంభాషణలతో పాటు తెహ్రీకా - హె- తాలిబాన్ పాకిస్థాన్ కు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరు యువకులపైఆమె ఆరోపణలు చేశారు. వారి స్కెచ్ లు కూడా విడుదల చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పాటు.. దేశాధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ సైతం బెనజీర్ హత్యోదంతాన్ని బ్రిటన్ కు చెందిన స్కాట్లాండ్ యార్డు టీంతో దర్యాప్తు చేయించారు. అయినా .. పెద్దగా ఫలితం లేకపోవటం గమనార్హం.

ఎందుకంటే.. ఆ నివేదికను భుట్టో భర్త అసీఫ్ అలీ జర్దారీ తోసి పుచ్చారు. ఆ రిపోర్టు తప్పుగా ఆయన పేర్కొన్నారు. ఈ హత్యను ముషారఫ్ చేయించారంటూ తీవ్రమైన ఆరోపణలు చేయటం గమనార్హం. అనంతరం పలు తర్జనభర్జనలు జరిగి.. ఐక్యరాజ్య సమితికి చెందిన నిజనిర్దారణ టీం.. ఒక నివేదికను రిలీజ్ చేసింది. అయితే.. ఆమె హత్యకు కారణమైన వారిని మాత్రం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం. మొత్తంగా పాక్ ను రెండుసార్లు పాలించిన ఒక మహిళా ప్రధానిని దారుణంగా హత్య చేస్తే.. అందుకు కారణమైన వారిని ఇప్పటివరకు గుర్తించకపోవటం చూస్తే.. పాక్ ఈ ఉదంతంలో సిగ్గు పడాల్సిందే.

Tags:    

Similar News