ఈసారి భారతరత్నలు వీరేనా ?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అన్నది తెలిసిందే. ఆ తరువాత స్థానం పద్మ విభూషణ్ ది.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అన్నది తెలిసిందే. ఆ తరువాత స్థానం పద్మ విభూషణ్ ది. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మశ్రీ వంటివి ఉంటాయి. దేశానికి ఎంతో సేవ చేసిన వారికి వివిధ రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న వారికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలని ఇస్తూంటారు. వారిని చూసి భావి తరాలు స్పూర్తి పొందాలని వారిలా దేశానికి తమ వంతుగా సేవ చేయాలని అన్న దాంతోనే ఈ అవార్డులు ఇస్తారు.
ఇక దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను 1954 నుంచి ఇస్తున్నారు. ఇప్పటిదాకా చూస్తే 53 మంది భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. మరణాంతరం కూడా ఈ పురస్కారం అందచేస్తారు. అలా కోవలో చాలా మందికి ఈ అవార్డు దక్కింది. ఇక 2024లో అత్యధికంగా ఒకేసారి అయిదుగురికి భారతరత్న అవార్డుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఒకేసారి నలుగురికి భార రత్న ఇచ్చింది. అలా ఈ రెండు సందర్భాలలో ఎక్కువ మందికి ఈ అవార్డుని అందించారు. ఈసారి భారతరత్న అవార్డులు ఎన్ని ఇస్తారు ఎందరికి ఇస్తారు అన్నది చర్చగా సాగుతోంది.
దేశంలో చూసుకుంటే ఇటీవలే మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయన దేశ గతినే మార్చారు. ఆర్ధిక సంస్కరణల శిల్పిగా పేరు పొందారు. ఈ రోజు దేశం ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది అంటే దానికి ఆయనే కారణం. ఆయన మరణం తరువాత మోడీ ప్రభుత్వం ఎంతలా ఆయనకు నివాళులు అర్పించిందో చూసిన వారు అంతా ఆయన పేరుని భారతరత్నకు తప్పక పరిశీలించవచ్చు అని భావిస్తున్నారు.
అదే విధంగా దేశంలో భారీ వ్యాపార దిగ్గజంగా మారి దేశ ఆర్ధిక పారిశ్రామిక రంగానికి చోదక శక్తిగా నిలిచిన రతన్ టాటా గత ఏడాది కన్నుమూసారు. ఆయనకు కూడా ఈ అవార్డు ప్రకటించాలని డిమాండ్ అయితే ఉంది. అదే విధంగా చూస్తే
మూడు దశాబ్దాల క్రితం కన్నుమూసిన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాంతో ఆయనకు ఈ ఏడాది ప్రకటించవచ్చు అన్న ఆశ అయితే తెలుగు వారిలో నిండుగా ఉంది. ఎందుచేతనంటే ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ఊపిరి అంతా తెలుగుదేశం నుంచే అందుతోంది. పైగా ఇటీవల ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న గారికి భారతరత్న ఇవ్వాలని కోరారని వార్తలు వచ్చాయి.
ఇక దేశంలో బహుజనులను అందరినీ కూడగట్టి సామాజిక రాజకీయ విప్లవానికి నాంది పలికిన బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కి భారతరత్న అవార్డు ప్రకటించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి కోరుతోంది. కాన్షీరాం దళిత జన ఉద్ధారకుడిగా పేరు పొందారు. దాంతో ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు.
ఇక చూడబోతే లిస్ట్ లో మరికొంతమంది దిగ్గజాల పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కి ఈ అవార్డు ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఆయన బీసీల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే ఒడిశాకు చెందిన మాజీ సీఎం దివంగత నేత బిజూ పట్నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. అదే వరసలో , వీర్ సావర్కర్,జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయ్ పూలే, బిహార్ కి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీకృష్ణ సింగ్, బీపీ మండల్ ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లు అయితే ఈ ఉన్నతమైన పురస్కారం కోసం వినిపిస్తున్నాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నలుగురు లేదా అయిదురుగురికి ఈ అవార్డుని కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రతీ ఏటా రిపబ్లిక్ డే వేళ భారతరత్న సహా పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటిస్తారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్నందువల్ల ఫిబ్రవరి మొదటి వారంలో ఈ జాబితాను కేంద్రం ప్రకటిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఎవరు భారత రత్నలుగా ఎంపిక అవుతారో.