అవును.. ఆ చిన్నారి 26 వేళ్లతో పుట్టింది.. ఎక్కడంటే?

అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఒక మహిళ జన్మనిచ్చిన బిడ్డకు 26 వేళ్లు ఉండటం విశేషం

Update: 2023-09-19 04:39 GMT

అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఒక మహిళ జన్మనిచ్చిన బిడ్డకు 26 వేళ్లు ఉండటం విశేషం. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే 26 వేళ్లతో పుడతారు. అందరూ 20 వేళ్లతో పుట్టటం.. కొందరికి ఒకట్రెండు వేళ్లు ఎక్కువగా ఉండటం తెలిసిందే. అయితే.. తాజా ఉదంతంలో మాత్రం చిన్నారికి ఏకంగా 26 వేళ్లు ఉండటం విశేషం. మరి.. సహజానికి భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంపై చిన్నారి కుటుంబ సభ్యుల రియాక్షన్ గురించి తెలిస్తే మాత్రం నోటి వెంట మాట రాదంతే.

ఎందుకంటే.. 26వేళ్లతో పుట్టిన తమ చిన్నారిని చూసుకొని కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారట. కారణం.. తాము పూజించే దేవత దయతోనే ఇలా జరిగిందని వారు భావిస్తున్నారు. రాజస్థాన్ లోని దీగ్ జిల్లాకు చెందిన ఒక మహిళ ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే.. ఆ చిన్నారి రెండు చేతులకు ఏడు వేళ్ల చొప్పున.. కాళ్లకి ఆరు వేళ్ల చొప్పున మొత్తం 26 వేళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు.

ఇలా జరగటం చాలా అరుదుగా చెబుతున్నారు. జెనిటికల్ డిజార్డర్ తోనే ఇలా జరుగుతుందని చెబుతుంటే.. చిన్నారి తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు మాత్రం తమ ఇంటి ఇలవేల్పు దోల్ గఢ్ దేవత దయతోనే ఇలా జరిగి ఉంటుందని నమ్ముతున్నారు. తమకు పుట్టిన బిడ్డ దేవత ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఇన్ని వేళ్లతో పుట్టటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే అలాంటివేమీ ఉండవని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News