తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే... భట్టి క్లారిటీ
దీంతో ఇరు పార్టీల మధ్య అప్పుల మీద హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ అసెంబ్లీలో అప్పుల మీద అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద దుమారం కొనసాగుతోంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ చెప్పిన మొత్తంలో తాము అప్పులు చేయలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య అప్పుల మీద హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పుల మీద ఓ క్లారిటీ ఇచ్చారు.
అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై నేడు స్వల్పకాలిక చర్చ సాగింది. ఈ చర్చలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రం అప్పు మొత్తం రూ.6.71 లక్షల కోట్లు ఉందని తెలిపారు. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తీరును తప్పుబట్టారు. అప్పులపై హరీశ్‌రావు అనేక ఆరోపణలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు చెప్పడం హరీశ్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు పెట్టిన పెండింగ్ బిల్లులే రూ.40,150 కోట్లు ఉన్నాయని భట్టి తెలిపారు. వాటిలో నుంచి రూ.12 వేల కోట్ల బిల్లులు క్లియర్ చేశామని పేర్కొన్నారు. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7 లక్షల 19వేల కోట్లు అని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష కోట్లు అప్పు చేశామని.. బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము ఏం చేయలేదని.. ఏడాదిలో తాము చేసిన అప్పుల వివరాలను సభ దృష్టికి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏడాది సమయంలో రూ.52,118 కోట్లు అప్పులు తెచ్చామని వెల్లడించారు.
ఇప్పటివరకు.. బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో నుంచి రూ.26వేల కోట్లు వడ్డీ చెల్లించామని డిప్యూటీ సీఎం తెలిపారు. రూ.8,855 కోట్లు అదనంగా ఆదాయం నుంచి వచ్చిందని, వాటిని కూడా అప్పులకే చెల్లించామని తెలిపారు. తాము ఒక్క రూపాయి కూడా దుబారా ఖర్చు చేయలేదని.. 1,18,364 కోట్లు అప్పులు చెల్లించామని స్పష్టం చేశారు. తెచ్చిన అప్పుల కంటే తాము చెల్లించిన చెల్లింపులే ఎక్కువ ఉన్నాయని తెలిపారు.
పదేళ్ల పాటు ఎవరికీ బిల్లులు చెల్లించలేదని, దాంతో వేలాది కోట్లాది రూపాయలు పేరుకుపోయాయని బీఆర్ఎస్‌పై భట్టి ఫైర్ అయ్యారు. పదేళ్లు హాస్టళ్లలో భోజనం సప్లై చేసే కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. దాంతో పిల్లలకు ముక్కిపోయిన బియ్యం సరఫరా చేశారని తెలిపారు. తాము హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెస్ చార్జీలు పెంచామని, కాస్మోటిక్ చార్జిలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచామని స్పష్టం చేశారు. ఇది తమ కమిట్‌మెంట్ అని స్పష్టం చేశారు. 2024లో 3 లక్షల 88 వేల కోట్లు హరీశ్‌రావు పెట్టిన బడ్జెట్ వివరాలనే ఇప్పుడు ఆర్బీఐ పేరుతో చెబుతున్నారని దుయ్యబట్టారు. హరీశ్ చెబుతున్న వివరాలన్నీ ఆయన పెట్టిన బడ్జెట్ పత్రాలలోనివేనని అన్నారు.