బొత్స మేనల్లుడికి షాక్ ఇస్తున్న భీమిలీ?

దీంతో భీమిలీలో కొత్త ఇంచార్జిగా వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని నియమించారు.

Update: 2025-02-09 18:30 GMT

విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఒకే ఒకసారి గెలిచింది. అది 2019 ఎన్నికల్లోనే. అది కూడా టీడీపీలో ఎంపీగా ఉంటూ అంతకు ముందు భీమిలీ నుంచి ఒకసారి గెలిచిన అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి రావడంతో సాధ్యపడింది. . చిత్రమేంటి అంటే ఇంతటి వైసీపీ ప్రభజనంలోనూ అవంతి మెజారిటీ పది వేలకు కూడా రాలేకపోయింది.

అంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ టీడీపీకి అక్కడ ఉంది. ఆ పార్టీకి తోడుగా మిత్రపక్షం జనసేన ఉంది. దాంతో భీమిలీలో 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఏకంగా 90 వేల పై చిలుకు మెజారిటీ గెలిచారు. ఏకంగా 63 శాతం ఓట్లు టీడీపీ కూటమికి పడ్డాయి. దాంతో వైసీపీకి భీమిలీలో కష్టం అని భావించే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తప్పుకున్నారు అని అంటున్నారు.

దీంతో భీమిలీలో కొత్త ఇంచార్జిగా వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని నియమించారు. ఆయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. విజయనగరానికి ఆనుకుని భీమునిపట్నం ఉండడంతో కలసి వస్తుందని రాజకీయ సామాజిక పరిస్థితులు అనుకూలిస్తాయని భావించి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే మజ్జి శ్రీనివాసరావు ఇంకా ఇంచార్జి బాధ్యతలను స్వీకరించలేదు కానీ వైసీపీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయాయి. ఆ పార్టీ నుంచి కీలక నాయకులు అంతా టీడీపీలోకి క్యూ కట్టేస్తున్నారు. ఆనందపురానికి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. దాంతో వైసీపీ వీక్ అవుతోంది అన్న సంకేతాలు అయితే వస్తున్నాయి.

దానికి కారణం ఏంటి అంటే వైసీపీకి చెందిన వారిని లోకల్ లీడర్స్ ని ప్రోత్సహించాలని వారు కోరుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎపుడూ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తోంది అన్న ఆగ్రహం ఉంది. ఇక భీమిలీలో రాజులకు పట్టు కొంత ఉంది. దాంతో తమకు ఈసారి అయినా చాన్స్ ఇస్తారా అని వారు ఆశగా ఎదురుచూశారు. అయితే వైసీపీ మాత్రం కాపు సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోంది.

అందుకే బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలు తప్పుకుని టీడీపీలో చేరిపోయారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీని పట్టించుకునే వారు లేరని నడిపే నాధుడు లేడన్న ఆవేదన క్యాడర్ లో ఉంది. ఎక్కడ నుంచో వచ్చి పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమని పూర్తి కాలం అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తేనే తప్ప బలమైన టీడీపీ కూటమిని ఎదుర్కోలేమని అంటున్నారు. దాంతో చాలా మంది నైరాశ్యంలో ఉన్నారు. మరి మజ్జి శ్రీనివాసరావు పార్టీని ఎలా గాడిన పెడతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News