గ్రాఫ్ పడిపోతున్న మాజీ మంత్రి...వైసీపీ చాయిస్ ఆయనేనా...?
విశాఖ జిల్లా భీమిలీ లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గ్రాఫ్ పడిపోతోందని ప్రచారం సాగుతోంది.
విశాఖ జిల్లా భీమిలీ లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గ్రాఫ్ పడిపోతోందని ప్రచారం సాగుతోంది. ఆయన ను నాన్ లోకల్ అని సొంత పార్టీ వారే మీడియా మీటింగ్స్ పెట్టి మరీ చెబుతున్నారు. జగన్ వేవ్ లో సైతం ఆయన జస్ట్ తొమ్మిది వేల ఓట్లతో అప్పటికే పొలిటికల్ గా అంత యాక్టివ్ కానీ క్యాండిడేట్ నుంచి గెలిచారు.
సరే గెలిచాక ఆయన పార్టీని పటిష్టం చేసుకుంటే బాగానే ఉండేది. కానీ మూడేళ్ల మంత్రిత్వంలో ఆయన పెద్దగా చేసినది లేదు అని అంటున్నారు. ఇక ఏడాదిగా పదవి లేదు, మరో తొమ్మిది నెలల లో ఎన్నికలు దాంతో అవంతి శ్రీనివాస్ కి ఈసారి భీమిలీ అగ్ని పరీక్ష అని చెబుతున్నారు.
నిజానికి అవంతి మంత్రిగా ఉన్నపుడే భీమిలీ పరిధి లో కార్పోరేటర్లను టీడీపీ గెలిచింది. అలాగే మండలాల ఎన్నికలలో సత్తా చాటింది. అంటే అప్పటికే ప్రమాద ఘంటికలు పార్టీకి మోగాయి. అయినా సర్దుకోలేదు అని అంటున్నారు వైసీపీ లో వర్గ పోరు దీనికి అదనం అవుతోంది.
మొదటి నుంచి వైసీపీ లో ఉన్న వారు అవంతి అనుచరులు. న్యూట్రల్ ఇలా వీరి మధ్య ఐక్యత కనిపించడంలేదు. ప్రత్యర్ధి పార్టీలుగా జనసేన టీడీపీ గట్టిగానే ఉన్నాయి. రెండు కలిస్తే యాభై వేలకు తక్కువ కాకుండా మెజారిటీ భీమిలీ లో వస్తుంది అని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం తీసుకుంటే అవంతిని తప్పించాలని ఉన్నా ఈ తక్కువ టైం లో సరైన క్యాండిడేట్ అయితే దొరకడంలేదు అని అంటున్నారు.
భీమిలీ లో మూడు మండలాల్లో కాపుల డామినేషన్ ఎక్కువ. ఆ సామాజికవర్గానికి చెందిన అవంతి ని మార్చితే అదే వర్గం నుంచి మొత్తం నియోజకవర్గం మీద పట్టున్న నేత, ఎమ్మెల్యే ఫిగర్ ఎలా ఇప్పటికిపుడు వస్తారు అన్నదే చర్చగా ఉందిట. అవంతి ని పోటీ చేయిస్తే మాత్రం ఓటమి తధ్యమని వైసీపీ సొంత సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు.
ఆయన్ని అనకాపల్లి నుంచి ఎంపీ క్యాండిడేట్ గా పోటీకి పెడతారు అని మరో ప్రచారం సాగుతోంది. ఆయనకు అలా వెళ్ళడం ఇష్టం లేదు అని అంటున్నారు. అయినా సరే ఆయన్ని ఒప్పించినా భీమిలీకి ఎవరు అభ్యర్ధిగా ఉంటారు ఇదే ఇపుడు భీమిలీ వైసీపీ లో హాట్ టాపిక్ గా ఉంది.
అయితే అనూహ్య పరిణామాలు రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అలా ఒక మాజీ మంత్రి గారి మీద వైసీపీ గురి ఉంది అని అంటున్నారు. ప్రత్యర్ధి పార్టీలో ఉన్న ఆయన కు భీమిలీ అంటే మక్కువ అని అంటున్నారు. ఆయనకు అక్కడ సమీకరణలు కుదరకపోతే చివరి క్షణం అయినా ఈ వైపుకు రప్పించాలని ఒక వ్యూహం అయితే పదిలంగా ఉంది అని అంటున్నారు.
ఆయన కనుక వైసీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం వైసీపీ విజయం నల్లేరు మీద నడకే అని అంటున్నారు. మరి ఆయన వస్తారా లేక హ్యాండ్ ఇస్తారా అలా అనుకుని కూర్చుంటే మాత్రం వైసీపీ కి లాస్ట్ మినిట్ లో పుట్టె మునుగుతుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి భీమిలీ రాజకీయం మొత్తం విశాఖ జిల్లానే ప్రభావితం చేసేలా ఉంది అని అంటున్నారు. అసలు సంచలనాలు అంటూ జరిగితే భీమిలీ సీటు నుంచే ఈసారి జరుగుతాయని కూడా ప్రచారంలో ఉన్న మాట.