ఇప్పటికి వెంటాడుతున్న భోపాల్ ట్రాజెడీ.. తేలని ప్రశ్నలు ఎన్నో..
40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ గురించి తెలియని వ్యక్తులు ఉండరు.
40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ గురించి తెలియని వ్యక్తులు ఉండరు. అయితే దీనికి సంబంధించి ఓ భయానక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా అప్పుడు బలైన వారే కాకుండా అనంతరం ఆ ప్రాంతంలో కొన్ని తరాలపాటు విషవాయువుల ప్రభావాన్ని గమనించినట్టు స్థానిక వైద్య నిపుణులు పేర్కొన్నారు.
1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి సమయంలో భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి వెలువడిన విష వాయువుల కారణంగా 3787 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఈ సంఘటనలో సుమారు ఐదు లక్షల మంది ప్రభావితులయ్యారు. ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఇక ప్రమాదం జరిగిన రోజు విషయానికి వస్తే.. భోపాల్ లోని మెడికల్ కాలేజీలో ఫోరం సెట్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ డీకే సత్పతి.. ఆరోజు దుర్ఘటనలో చనిపోయిన 875 మంది శవాలకు పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు సుమారు 18 వేలమంది బాధితుల శివపరీక్షలకు సాక్షిగా నిలిచారు. ఈ పూర్తి కాలంలో ఆయనకు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి.
ఈ నేపథ్యంలో భోపాల్ దుర్ఘటన బాధితుల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రమాదానికి సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన మహిళలకు పుట్టబోయే పిల్లలపై ప్రభావం ఉన్నట్లు ఆయన లేవనెత్తిన ప్రశ్నలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఖండించిందని.. అటువంటి ప్రభావాలు ఏమీ ఉండవని పేర్కొందని ఆయన తెలిపారు. అయితే అప్పుడు ప్రమాదంలో మరణించిన గర్భిణీల రక్త నమూనాలను పరీక్షించిన సమయంలో.. తల్లిలో ఉన్న విష పదార్థాలలో 50% గర్భంలో ఉన్న శిశువులో కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే వీటిపై జరిపిన పరిశోధనలను ఎందుకు నిలిపివేశారు అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఈ ఫ్యాక్టరీ నుంచి విడుదలైనటువంటి మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ నీటిలో కలవడం వల్ల క్యాన్సర్ లాంటి భయానక వ్యాధులకు కారణమయ్యే విషవాయువులు ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పటివరకు భోపాల్ దుర్ఘటన గురించి ఒక్క యాంగిల్ మాత్రమే తెలిసిన చాలామందికి డాక్టర్ డీకే సత్పతి మాటల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి.