భూమ‌న కీలక నిర్ణయాలు... వైరల్ గా మారుతున్న సనాతన కామెంట్లు!

తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో సనాతన ధర్మం పై జరుగుతుతున్న పొలిటికల్ రచ్చపైనా స్పందించారు.

Update: 2023-09-05 12:10 GMT

తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించిన కొత్తలో... క్రిస్టియన్ ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ని చేస్తారా అంటూ వినిపించిన కామెంట్లకు తనదైన శైలిలో రియాక్ట్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి... తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో సనాతన ధర్మం పై జరుగుతుతున్న పొలిటికల్ రచ్చపైనా స్పందించారు.

అవును... గతంలో వైఎస్సార్ హ‌యాంలో టీటీడీ చైర్మన్‌ గా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి.. రెండోసారి ఆ పదవిని అలంకరించిన తర్వాత అదేస్థాయిలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... రామకోటి తరహాలో గోవిందకోటి అనే అంశాన్ని, దానికి టీటీడీ ఇచ్చే ఫలితాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు.

ఇందులో భాగంగా... 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతీ, యవకులు రామకోటి తరహాలో గోవిందకోటిని రాస్తే... వారి కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం క‌ల్పించాల‌ని నిర్ణయించారు. తాజాగా భూమ‌న నేతృత్వంలో జరిగిన మొద‌టి పాల‌క మండ‌లి స‌మావేశం ఈ మేరకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇదే సమయంలో... 10 లక్షల వెయ్యి నూటపదహారు (10,01,116) సార్లు గోవిందనామాలు రాసిన‌ వారికి దర్శన భాగ్యం కల్పించ‌నున్నట్టు క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా... తిరుపతిలోని పురాతనమైన 2,3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం, శ్రీపఠం వసతుల‌ సముదాయాలను నిర్మించాల‌ని ఈ స‌మావేశంలో తీర్మానించింది.

ఇదే క్రమంలో... ముంబ‌యిలోని బాంద్రాలో రూ. 5.35 కోట్లతో టీటీడీ సమాచార కేంద్రం, 1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేప‌ట్టనున్నట్లు ఈ రోజు బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా... రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం, రూ.49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతు ప‌నులు చేయనున్నారు!

కాగా.... టీటీడీ చైర్మన్ గా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మొదటిసారి ఎన్నికైన సమయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ద‌ళిత గోవిందం.. క‌ళ్యాణ‌ మ‌స్తు.. చంటి బిడ్డల త‌ల్లిదండ్రులు, వృద్ధుల‌కు ప్రత్యేక ద‌ర్శనం.. తిరుమ‌ల‌కు వెళ్లే ప్రతి భ‌క్తుడికి శ్రీ‌వారి ద‌ర్శనంతో సంబంధం లేకుండా అన్న ప్రసాదం అంద‌జేయ‌డం త‌దిత‌ర ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు!

మరోవైపు త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్.. సనాతన ధర్మం నిర్మూళన అవసరం అంటూ చేసిన కామెంట్స్‌ పైనా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా... స్టాలిన్ కామెంట్స్‌ ను ఆయన ఖండించారు. ఇదే సమయంలో సనాతన ధర్మం మతం కాదని.. అదొక జీవన యానమని ఆయన తెలిపారు.

ఈ విషయం తెలియక.. సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి కొంతమంది విమర్శలు చేస్తున్నారని.. దానివల్ల సమాజంలో అలజడి చెలరేగే ప్రమాదం వుంటుంద‌ని భూమన ఆందోళ‌న వ్యక్తం చేశారు.

Tags:    

Similar News