బైడెన్ చేతిలో ‘పాలస్తీనాపై వందేళ్ల యుద్ధం’..ఏమిటా వివాదాల పుస్తకం?
పాలస్తీనా సమస్యపై కొలంబియా యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్ రషీద్ ఖలీ ఓ పుస్తకం రాశారు. దాని పేరు ‘ద హండ్రెడ్ ఇయర్స్ వార్ ఆన్ పాలస్తీనా.’
అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో జో బైడెన్ మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. తన పాలనా కాలంలో తీవ్ర విమర్శల పాలైన ఆయన.. దిగిపోతూ కూడా ఉక్రెయిన్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసు మీద పడడం, అనారోగ్యం తదితర కారణాలతో బైడెన్ బాగా అన్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. పైగా అధ్యక్ష ఎన్నికల చివరి సమయంలో అభ్యర్థిత్వం నుంచి తప్పుకొన్నరు. ఆయన అసమర్థతే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, మళ్లీ ఇప్పుడు బైడెన్ వార్తల్లో నిలిచారు.
ఎవరిదీ నేల..?
పశ్చిమాసియాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతం ఇజ్రాయెల్-పాలస్తీనా. వందల వేల ఏళ్ల కిందట ఇక్కడినుంచి యూరప్ తదితర ప్రాంతాలకు వెళ్లిపోయిన యూదులు.. జర్మనీ నియంత హిట్లర్ దాష్టీకంతో మళ్లీ ఇజ్రాయెల్ అనే ఇప్పుడున్న ప్రాంతానికి వచ్చారు. ఓ వాదన ప్రకారం.. అప్పటికే ఉన్న పాలస్తీనాను కొంతకొంతగా కలిపేసుకుంటూ ఇజ్రాయెల్ ను విస్తరించుకున్నారు. ఇప్పుడా ఇజ్రాయెల్ పెద్దగా అయి.. పాలస్తీనా అనే ‘దేశం’ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ కు పరిమితం అయింది. దీంతో ఎవరిదీ నేల? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడో వెళ్లిపోయి తిరిగొచ్చిన యూదులదా..? అక్కడ వందల ఏళ్లుగా ఉన్న ముస్లింలదా? కాగా, ఇలాంటి గాజా నుంచే గత ఏడాది అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్ సభ్యులు ఇజ్రాయెల్ పై దాడికి దిగారు.
వందేళ్ల దాడి..
పాలస్తీనా సమస్యపై కొలంబియా యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్ రషీద్ ఖలీ ఓ పుస్తకం రాశారు. దాని పేరు ‘ద హండ్రెడ్ ఇయర్స్ వార్ ఆన్ పాలస్తీనా.’ తమ ఇష్టానికి విరుద్ధంగా మాతృ భూమిని ఇతరులకు విడిచిపెట్టాలని కొన్ని వర్గాలు స్థానికుల (ముస్లింలు)పై ఒత్తిడి తెస్తున్నాయని.. వారికి వ్యతిరేకంగా వలసవాద యుద్ధం జరుగుతున్నదని ఖలీ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఇప్పుడది మసాచుసెట్స్ లోని బుక్ స్టోర్ లో బైడెన్ తన చేత పట్టుకుని ఉండడం ఫొటోలకు చిక్కింది. దీంతో
చర్చనీయాంశమైంది. ఓవైపు ఇజ్రాయెల్-హమాస్ 14 నెలలుగా పోరాటం చేస్తుండగా.. పాలస్తీనాకు మద్దతుగా రాసిన పుస్తకం అమెరికా అధ్యక్షుడి చేతిలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
కొన్నారా? ఎవరైనా చేతిలో పెట్టారా?
బైడెన్ ఇజ్రాయెల్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా ఇజ్రాయెల్ పట్ల ఇదే వైఖరి ప్రదర్శిస్తారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం మినహా మిగతా అన్ని సందర్భాలలో బైడెన్ ఇజ్రాయెల్ కు మద్దతుగానే ఉన్నారు. అలాంటాయన చేతిలో పాలస్తీనా అనుకూల పుస్తకం ఉండడంతో ఆయన దానిని కొన్నారా..? లేక ఎవరైనా దానిని ఇచ్చారా..? అనేది చర్చనీయాంశమైంది. ఎవరైనా ఇచ్చినా దుకాణంలో నుంచి వచ్చేటప్పుడు బయటకు ఎలా తీసుకొస్తారు? అనే ప్రశ్న మొదలైంది. కాగా.. ఖలీ ఈ పుస్తకాన్ని నాలుగేళ్ల కిందటే రాశారు. తాజాగా బైడెన్ చేతిలో ఉండడంపై స్పందిస్తూ.. ‘‘నాలుగు సంవత్సరాలు.. చాలా ఆలస్యం’’ అని వ్యాఖ్యానించారు.
కొసమెరుపు: అమెరికాలో నవంబరు ఆఖరి శుక్రవారం జరిగే బ్లాక్ ఫ్రేడే సేల్ కు ఆదరణ బాగా ఉంటుంది. బైడెన్ చేతిలో కనిపించిన పుస్తకం ఇలా ‘బ్లాక్ ఫ్రైడే’ షాపింగ్ కు వచ్చిన సందర్భంలోనిదే.