టీడీపీలో బిగ్ డిబేట్ : 'కమ్మలు' ఓకే.. 'రెడ్ల' మాటేంటి ..!
వైసీపీ అధినేత జగన్ పేరు చెప్పకుండానే.. పరుష వ్యాఖ్యలు సంధిస్తూ.. ఆయనను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని.. చెబుతున్నారు.
రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మరింత సంఘటితం కావాలని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. చంద్రబా బుకు అండగా ఉండాలని సమాజంలో అంతో ఇంతో పేరున్న కొందరు వ్యక్తులు చెబుతున్నారు. మరికొం దరు బహిరంగ ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పేరు చెప్పకుండానే.. పరుష వ్యాఖ్యలు సంధిస్తూ.. ఆయనను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని.. చెబుతున్నారు. ఈ క్రమంలో కమ్మలు కలసి కట్టుగా ముందుకు సాగాలని కూడా సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఉదంతాలను కూడా లెక్క పెడుతున్నారు. అప్పట్లో కమ్మలపై ఒక యుద్ధమే చేశారని.. అణిచేసే ప్రయత్నాలు జరిగాయని కూడా మేధావి వర్గంగా పేరున్న కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వాస్తవమే కావొచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు అధికారుల నుంచి నాయకుల వరకు.. వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి.. ఆ మాత్రం కోపం.. కసి ఉండడంలో తప్పులేదు.
కానీ, ఇదేసమయంలో కేవలం కమ్మలు మాత్రమే సంఘటితం కావాలని.. జగన్‌ను ఓడించాలని చెప్పడం ద్వారా.. కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని వదులు కోవడంపైనే అసలు చర్చ ఉంది. ఆనాడు కమ్మలపై నిజంగానే వైసీపీ దాడులు చేసిందని ఒప్పుకొంటే.. ఎన్నికల్లోవైసీపీకి ఎలాంటి ఫలితం దక్కిందో అందరూ చూశారు. సంఘటితం అయ్యారో.. లేదో ఈ ఫలితమే చెప్పింది. అయితే.. ఆనాడు.. వీరితోపాటు.. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కూడా.. వైసీపీ వోడిపోయింది. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి.
అంటే.. ఆ నాడు.. వైసీపీ ని వ్యతిరేకించింది.. కేవలం కమ్మలే కాదు.. రెడ్లు కూడా. కాబట్టి.. సంఘటితం కావాలని కోరుకునే మేధావులు రెడ్లను విస్మరిస్తే.. అది మరింత ప్రమాదం. కమ్మలు ఎలానూ.. సంఘటితం గానే ఉన్నారు. చంద్రబాబు కావాలనే కోరుకున్నారు. కానీ, ఎటొచ్చీ.. టీడీపీకి, చంద్రబాబుకు కలిసి వచ్చిన అంశం.. రెడ్డి ఓటు బ్యాంకు. దీనిని మరింత చేరువ చేసుకునే ప్రయత్నం చేయాలే తప్ప.. కమ్మలను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా.. రెడ్లను రెచ్చగొట్టి.. దూరం చేసుకుంటే.. అది మున్ముందు.. ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. కాబట్టి కేవలం ఒకే సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకునిచేసే వ్యాఖ్యలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది సూచన.