బిగ్ రిలీఫ్ అనేలా ట్రాయ్ తాజా మార్గదర్శకాలు!

తప్పు దారి పట్టించే మెసేజ్ లతో పాటు.. వేళపాళలతో సంబంధం లేకుండా వచ్చి పడే వ్యాపార కాల్స్ కు చెక్ పెట్టేలా సరికొత్త మార్గదర్శకాల్ని ట్రాయ్ జారీ చేసింది.

Update: 2023-11-10 16:30 GMT

శరీరంలో భాగంగా మారిన సెల్ ఫోన్ కు తరచూ అడ్డదిడ్డమైన మెసేజ్ లు.. చిరాకు ఫోన్ కాల్స్ రావటం ఈ మధ్యన మరింత పెరుగుతోంది. తప్పు దారి పట్టించే మెసేజ్ లతో పాటు.. వేళపాళలతో సంబంధం లేకుండా వచ్చి పడే వ్యాపార కాల్స్ కు చెక్ పెట్టేలా సరికొత్త మార్గదర్శకాల్ని ట్రాయ్ జారీ చేసింది. వీటిని టెలికం సంస్థలు తక్షణమే అమలు చేయాలని పేర్కొంది.

ప్రమోషనల్.. స్పామ్ ఎస్ఎంఎస్ లకు సంబంధించి ట్రాయ్ జారీ చేసిన సరికొత్త మార్గదర్శాలు అమలైతే.. కోట్లాది మంది మొబైల్ యూజర్లకు కాస్తంత రిలీఫ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇకపై మెసేజ్ లు పంపటానికి ముందు సదరు మొబైల్ యూజర్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది.

ప్రమోషనల్ సందేశాలకు చెక్ పెట్టటానికి వీలుగా డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్ పేరుతో ట్రాయ్ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ప్రకారం లోన్స్ ఇస్తామని.. ప్రత్యేక ప్లాన్లు అంటూ బ్యాంకులు.. బీమా కంపెనీలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. కొన్ని కాల్ సెంటర్లు అదే పనిగా ఫోన్లు చేయటం.. మెసేజ్ లు పంపటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ.. అలాంటివి పంపాలంటే ముందుగా వినియోగదారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా మెసేజ్ లు.. బల్క్ కాల్స్ చేసే ఏజెన్సీ ఏదైనా వినియోగదారుడికి పంపే ముందు టెలికం ఆపరేటర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఆపరేటర్ 127తో మొదలయ్యే షార్ట్ కోడ్ తో ఒక ఎస్ఎంఎస్ ను పంపుతారు. అందులో దేని అనుమతి కోసం తాము కోరుతున్న విషయాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఆ మెసేజ్ కు మనం ఎస్ అంటామా? నో చెబుతామా? అన్నది మన ఇష్టం. దీని విషయంలో అప్రమత్తంగా ఉండి.. నో చెప్పేస్తే అనవసరమైన మెసేజ్ లకు మంగళం పాడొచ్చు.

ఒకవేళ.. పొరపాటున ఎస్ చెప్పి.. ఆ తర్వాత నో అంటే కూడా ప్రమోషనల్ మెసేజ్ లను ఆపాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇలాంటి వాటి కోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ సూచన చేసింది. తక్షణమే ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని చెప్పింది. అంతేకాదు.. స్పామ్ కాల్స్.. ఎస్ఎంఎస్ లను గుర్తించేందుకు వీలుగా ట్రాయ్ ‘‘ట్రాయ్ డీఎన్ డీ 3.0 పేరుతో ఒక యాప్ ను తయారు చేసింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవటం మంచిదన్న సూచన చేస్తున్నారు. మరింత చెక్ చేసి తుది నిర్ణయం తీసుకుంటే మంచిది.

Tags:    

Similar News