బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌.. సుప్రీం సంచలన తీర్పు!

11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.

Update: 2024-01-08 07:20 GMT

గుజరాత్‌ కు చెందిన మహిళ బిల్కిస్‌ బానో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. బిల్కిస్‌ బానో పిటిషన్‌ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. తన కేసులో 11 మంది దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా 20 ఏళ్ల క్రితం మార్చి 3, 2002న గోద్రా రైలు దహన ఘటన జరిగిన తర్వాత గుజరాత్‌ లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుండగులు ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్‌ బానో కుటుంబంపై దాడి చేసి ఏడుగురిని హత్య చేశారు. అంతేకాకుండా గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను గ్యాంగ్‌ రేప్‌ చేశారు. చివరకు ఆమె మూడేళ్ల చిన్నారిని కూడా వదలకుండా హత్య చేశారు.

ఈ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు పడింది. అయితే గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 11 మంది నేరస్తులకు గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఇప్పటికే వారంతా పదేళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించారని.. దీంతో వారికి క్షమాభిక్ష పెడుతున్నామని వెల్లడించింది. దీంతో 11 మంది గతేడాది జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ వ్యవహారంపై గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వంపై, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు, పలువురు సివిల్‌ సర్వెంట్లు ఘాటు విమర్శలు చేశారు. మోడీ తెల్లవారి లేస్తే నారీశక్తి, మహిళా సాధికారత అని ఉపన్యాసాలు దంచుతుంటారని.. మరి ఐదు నెలల గర్భిణి అనే కనికరం లేకుండా ఒక మహిళపై అత్యాచారం చేసిన నిందితులను ఎలా విడిచిపెడతారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

కాగా ఆ ఘటనలో తన మూడేళ్ల కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని బిల్కిస్‌ బానో భర్త రసూల్‌ నాడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగాక సుప్రీంకోర్టు బిల్కిస్‌ బానో కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.50 లక్షల పరిహారం అయితే ఇచ్చారు కానీ ఉద్యోగం, ఇల్లు ఇప్పించలేదని బిల్కిస్‌ బానో భర్త రసూల్‌ గతేడాది సంచలన ఆరోపణలు చేశాడు.

బిల్కిస్‌ బానో రేప్‌ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్‌ నాయ్, గోవింద్‌ భాయ్‌ నాయ్, శైలేష్‌ భట్, రాధేశ్యామ్‌ షా, బిపిన్‌ చంద్ర జోషి, కేసర్‌భాయ్‌ వోహానియా, ప్రదీప్‌ మోర్ధియా, బకాభాయ్‌ వోహానియా, రాజుభాయ్‌ సోనీ, మితేష్‌ భట్, రమేశ్‌ చందనా అనే 11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.

ఇప్పుడు ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలయిన 11 మంది మళ్లీ జైలుశిక్షను అనుభవించనున్నారు.

Tags:    

Similar News