మై ఫ్రెండ్ బిల్ గేట్స్ గిఫ్ట్ : చంద్రబాబు ట్వీట్
తన జీవిత చరిత్ర ఆధారంగా "సోర్స్ కోడ్" అనే పుస్తకాన్ని చంద్రబాబుకు ప్రదానం చేశారు బిల్ గేట్స్. త్వరలో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తనకు గిఫ్ట్ ఇచ్చిన బిల్ గేట్స్ కు ట్యాంక్స్ చెబుతూ ఎక్స్ లో చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్, చంద్రబాబు మధ్య 30 ఏళ్లుగా స్నేహం ఉంది. దావోసులో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ ఇద్దరు తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఓల్డ్ ఫ్రెండ్ చంద్రబాబుకు బిల్స్ గేట్స్ ఓ గిప్ట్ ఇచ్చారు. దాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిల్ గేట్స్ ఏ గిఫ్ట్ ఇచ్చారని ఆ ఇద్దరి భేటీ తర్వాత చర్చ జరిగింది. అయితే తనకు బిల్ గేట్స్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనంటూ చంద్రబాబు చెప్పడంతో సస్పెన్స్ తొలగిపోయింది. తన జీవిత చరిత్ర ఆధారంగా "సోర్స్ కోడ్" అనే పుస్తకాన్ని చంద్రబాబుకు ప్రదానం చేశారు బిల్ గేట్స్. త్వరలో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. అయితే ఆ కార్యక్రమానికి ముందుగానే సీఎం చంద్రబాబుకు ఓ కాపీ బహూకరించారు. దీన్ని చదివిన చంద్రబాబు ఎక్స్ వేదికగా బిల్ గేట్స్ ను అభినందించారు. తన స్నేహితుడు ఇచ్చిన పుస్తకంలో ఆయన కళాశాల రోజుల నుంచి మైక్రోసాఫ్ట్ నెలకొల్పే వరకు సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉందని సీఎం అభినందించారు.
దావోసులో బిల్ గేట్స్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఆరోగ్యం, ఏఐ, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రతిపాదనపై తన సహచరులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని త్వరలో రాష్ట్రానికి వస్తానని బిల్ గేట్స్ చెప్పారు.
అదేవిధంగా చంద్రబాబు చొరవతో 1995లో హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్ అక్కడ మైక్రోసాఫ్ట్ ను కంపెనీని ప్రారంభించారు. అప్పటి నుంచి బాబు, బిల్ గేట్స్ మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. ఇక ఏఐలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించడంతోపాటు మిలిందా-గేట్స్ ఫౌండేషన్ ద్వారా దక్షిణ భారత్ లో ప్రజా సేవ చేయాలని బిల్ గేట్స్ ను సీఎం కోరారు. గేట్స్ ఫౌండేషన్ కు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చాలని అభ్యర్థించారు.