పాపం అదానీ.. ఏడాదిలో రూ.లక్ష కోట్ల సంపద ఆవిరి!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంపదను పోగొట్టుకున్న బిలియనీర్లు ఎవరు? ఎంత భారీగా ఆదాయాన్ని ఆవిరి చేసుకున్నారన్న వివరాల్లోకి వెళితే.. అవాక్కు అవ్వాల్సిందే.

Update: 2025-02-22 04:25 GMT

రోటీన్ కు భిన్నమైన వార్తగా దీన్ని చెప్పాలి. ఎప్పుడూ ఏడాదిలోనో.. ఆర్నెల్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల్లో తోపులు ఎవరు? సదరు కాలానికి ఎవరెంత వెనక వేశారు? లాంటి సమాచారంతో వార్తలు చదివి ఉంటారు. ఇప్పుడు మీరు చదివే వార్త మాత్రం అందుకు భిన్నం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంపదను పోగొట్టుకున్న బిలియనీర్లు ఎవరు? ఎంత భారీగా ఆదాయాన్ని ఆవిరి చేసుకున్నారన్న వివరాల్లోకి వెళితే.. అవాక్కు అవ్వాల్సిందే.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రపంచ కుబేరుడిగా..అత్యంత సంపన్నుడిగా జాబితాలో మొదటి స్థానంలో ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఈ ఏడాది మొదటి యాభై రోజుల్లో భారీగా నష్టపోయిన వారిలోనూ మొదటి స్థానంలోనే ఉండటం విశేషం. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఆధారంగా చూస్తే.. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దాదాపు రూ.3 లక్షలకోట్ల సంపదను పోగొట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన సంపదలో ఈ భారీ మొత్తం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆవిరి అయినట్లుగా తెలిపారు.

మస్క్ తర్వాతి స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద దాదాపు రూ.లక్ష కోట్లు ఆవిరైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఈ ఏడాది అధికంగా సంపదను పోగొట్టుకున్న జాబితాలో ఈ ఇద్దరు టాప్ లో నిలవటం గమనార్హం. ఇక.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పటిలానే ఎలాన్ మస్క్ టాప్ లో నిలిచారు. ఇక.. మన దేశ కుబేరుడిగా పేర్కొనే ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 17వ స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.25వేల కోట్లు తగ్గి.. రూ.7.5 లక్షల కోట్లకు పరిమితమైంది.

ఇక గౌతమ్ అదానీ సంపద రూ.5.75 లక్షల కోట్లుగా తేల్చారు. హెచ్ సీఎల్ కు చెందిన శివనాడార్ సంపద సైతం కోత పడింది సుమారు రూ39వేల కోట్ల మేర ఆయన సంపద తగ్గినట్లుగా గుర్తించారు. తాజా సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం ఎలాన్ మస్క్ కాగా.. రెండో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్.. మూడో స్థానంలో అమెజాన్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఒరాకిల్ వ్యవస్థాపకుడు ఎల్లిసన్ నిలిచారు.

Tags:    

Similar News