Begin typing your search above and press return to search.

ప్రభుత్వ టీచర్ల బిట్ కాయిన్ మోసం.. జాగ్రత్త!

నిర్మల్‌ జిల్లాలో ఏకంగా 40మంది టీచర్లు వందల మందిని సభ్యులుగా చేర్పించి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించారని తెలు స్తోంది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 11:55 AM GMT
ప్రభుత్వ టీచర్ల బిట్ కాయిన్ మోసం.. జాగ్రత్త!
X

అదో.. ఉందో లేదో తెలియని నగదు.. మార్చకుందామంటే కనిపించదు.. అమ్ముదామంటే కొనేవారు ఉండరు.. అలాంటి మాయా నగదును చూపి అక్రమ దందాకు తెరలేపారు కొందరు.. అయితే, వీరెవరో సాధారణ వ్యక్తులు కాదు.. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. అది కూడా ప్రైవేటే వారు కాదు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ‘బిట్ కాయిన్’ అనే బ్రహ్మ పదార్థాన్ని చూపి.. అధిక వడ్డీ వల వేసి.. అమాయకులతో ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టిస్తూ చేయాల్సి మోసం అంతా చేస్తున్నారు. అయితే, ఇందులో కొందరు పోలీసులూ బాధితులుగా ఉండడమే కీలక అంశం. నిర్మల్‌ జిల్లాలో ఏకంగా 40మంది టీచర్లు వందల మందిని సభ్యులుగా చేర్పించి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించారని తెలు స్తోంది. ఇవన్నీ తిరిగి రావడం కష్టమేనని నిపుణు లు పేర్కొంటున్నారు.

ఊహాజనిత నగదు..

క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్‌.. ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేర్లు. చట్టబద్ధత లేని నగదు ఇది. కానీ, దీనికీ అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రభుత్వ టీచర్లు. ఆదాయ వర్గాలను లక్ష్యంగా ఎంచుకుని వారు సాగిస్తున్న దందాకు పోలీసులు అడ్డుకట్ట వేసినా.. అప్పటివరకు జరిగినదంతా కూడా నేరమే కదా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఉదంతం వివరాలు ఇలా.. కడెం మండలం నవాబ్‌ పేట కు చెందిన సల్ల రాజ్‌కుమార్‌, సాయి కిరణ్‌, నిర్మల్‌ వాసులు కండెల నరేశ్‌, గంగాధర్‌, మహేశ్‌ లు బిట్‌ కాయిన్‌ దందాకు దిగారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.14 వేలు వస్తాయని అమాయకులను దందాలోకి దించారు. ఒక్క నిర్మల్‌ జిల్లాలోనే రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పొందారు. వీరి మాయలో పడిన కొంతమంది అప్పులు చేసి మరీ బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టినట్టు పోలీసుల దృష్టికి వెళ్లింది. కాగా, నిందితుల్లో ఆర్మూర్‌ ఎక్సైజ్‌ ఎస్సై గంగాధర్‌ కూడా ఉండడం గమనార్హం.

డాలర్లు పోగేయొచ్చని.. వందల మందిని చేర్పించి..

యూ-బిట్‌ కాయిన్‌. నిర్మల్ జిల్లాలో సాగించిన చైన్ దందాకు పేరు ఇది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ దీనిని నడిపించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక చొరవ చూపి.. ఆటకట్టించారు. అరెస్టు చేసిన ఏజెంట్లలో ఎక్సైజ్‌ ఎస్సై గంగాధర్ తో పాటు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి, కానిస్టే బుల్‌ ఇద్దరు టీచర్లు ఉన్నారు.

50 వేల పెట్టుబడి.. డాలర్లలో ఆదాయం..

రూ.50 వేల పెట్టుబడి పెడితే చాలు.. డాలర్ల రూపంలో కాయిన్లు వస్తాయని నమ్మబలికి.. యూ-బిట్ దందా సాగించారు. వారు పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల వడ్డీ రూపంలో ప్రత్యే క ఖాతాలో జమవుతున్నట్లు చూపుతున్నారు. అయితే, గొలుసు విధానం కావడంతో వారితో పాటు మరో ఐదుగురిని చేర్పించాలి. తద్వారా మరింత ఆదాయం వస్తుందని నమ్మబలుకుతారు.

మెగా స్టార్.. సూపర్ స్టార్..

మెగా స్టార్.. సూపర్ స్టార్.. ఇదేదో చిరంజీవి, మహేశ్ బాబు గురించి కాదు.. యూ-బిట్ కాయిన్ లో ఎక్కువ మంది సభ్యులను చేర్పిస్తే పొందే ‘స్టార్’ రేటింగ్ అట. ఎంత ఎక్కువమందిని చేర్పిస్తే.. అంత స్టార్ అని చెబుతున్నారు. ఐదు స్టార్లు (ఫైవ్ స్టార్) పొందిన వారు సీనియర్ హోదాలో జిల్లా అంతటా సభ్యులను చేర్పించారని పోలీసులు చెబుతున్నారు. యూ-బిట్ మోసం నిర్మల్ కే కాక.. పొరుగునున్న జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకూ పాకింది. ఈ జిల్లాల్లోని కోరుట్ల, మెట్‌ పల్లి, ఆర్మూర్‌ పట్టణాల్లో యూ-బిట్ బాధితులు ఉన్నారు.

చివరకు మిగిలేది ఉండదు..

చైన్ దందాలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. చివరి వారికి మిగిలేది ఏమీ ఉండదు. మొదట్లో చేరినవారు అంతా దండుకుని దుకాణం మూసేస్తారు. చివరకు ఎవరు చెల్లింపులు చేస్తారనేది ఉండదు.అది తెలియని అమాయకులు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. కాగా, నిర్మల్‌ లో పెద్దఎత్తున సాగుతున్న యూ-బిట్‌ కాయిన్‌ దందాపై రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. నిర్మల్‌ ఎస్పీ నివేదిక ఆధారంగా సైబర్‌ క్రైం ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆరా తీయనున్నట్లు తెలిసింది.