బీజేపీ సీఎంల ఎంపికలో వ్యూహం ఇదేనా ?

భారతీయ జనతా పార్టీ వయసు జనసంఘ్ తో కలిపి చూసుకుంటే డెబ్బై రెండేళ్ళు. ఆ పార్టీ ఆలోచనలు ఎపుడూ సంస్థాగతంగా బలోపేతం కావడమే.

Update: 2025-02-22 03:43 GMT

భారతీయ జనతా పార్టీ వయసు జనసంఘ్ తో కలిపి చూసుకుంటే డెబ్బై రెండేళ్ళు. ఆ పార్టీ ఆలోచనలు ఎపుడూ సంస్థాగతంగా బలోపేతం కావడమే. బీజేపీలో నాయకుల కన్నా పార్టీ గొప్పది. అదే అంతా పాటించేది. అయితే వాజ్ పేయి అద్వానీ, అలాగే నరేంద్ర మోడీ అమిత్ షాలు మాత్రం పార్టీ కంటే ఎక్కువ ఇమేజ్ సాధించారు.

ఇక వాజ్ పేయి అద్వానీ జోడీ విషయం తీసుకుంటే హిట్ పెయిర్ గా నిలిచారు. ఆ కాలంలో కూడా పార్టీయే మిన్న అన్న విధానం ఉండేది, ఇక మోడీ అమిత్ షాల జోడీతో పార్టీ కంటే కూడా ఈ ఇద్దరు నాయకులే ఎక్కువగా ఇమేజ్ తో కనిపిస్తారు. ఇదీ తేడా.

వీరి తరువాత చూస్తే ముఖ్యమంత్రులలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ కనిపిస్తారు. ఇదిలా ఉంటే గతంలో బీజేపీ సీఎం ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా ఈ విషయంలో లో ప్రొఫైల్ తో ఉన్న నాయకులను సీఎం గా ఎంపిక చేయడం ద్వారా పార్టీయే మిన్న అన్నది చాటి చెబుతున్నారు.

సొంత ఇమేజ్ కలిగిన నాయకులను సీఎంలుగా చేయడం లేదన్నది ఇక్కడ గమనించాల్సి ఉంది. అంతే కాదు అందరూ అనుకునే వారిని ప్రచారంలో ఉన్న వారిని సీఎంలుగా చేయడంలేదు. ఉదాహరణకు తాజాగా ఢిల్లీ సీఎం ఎంపికనే తీసుకుంటే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ. ఆయనే కొత్త సీఎం అని అంతా అనుకున్నారు.

ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. దాంతో ఆయన కాక మరెవరు అన్నది కూడా అందరూ లెక్క వేశారు. చిత్రంగా బీజేపీ పెద్దలు మాత్రం రేఖా గుప్తాను ఎంపిక చేశారు. ఆ విధంగా చూస్తే సొంత ఇమేజ్ ఉన్న వారిని పక్కన పెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఈ ఒక్క ఉదాహరణే కాదు, రాజస్థాన్ లో చూస్తే గట్టి నాయకురాలిగా వసుంధరారాజే ఉన్నారు. ఆమె మాజీ సీఎం, సొంత ఇమేజ్ బాగా ఉన్న వారు ఆమెను కాదని అక్కడ భజన్ లాల్ శర్మ అన్న కొత్త ముఖాన్ని తెర మీదకు తెచ్చి సీఎం గా చేశారు. ఇది అనూహ్యమైన నిర్ణయంగానే అంతా చూశారు.

అదే విధంగా ఒడిషాలోనూ జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మోహన్ చరణ్ మఝి ని ఎంపిక చేశారు. ఇక్కడ కూడా చాలా మంది పేరెన్నిక కలవారు సీఎం సీటు కోసం పోటీ పడినా సైడ్ అయిపోయారు. అదే విధంగా మధ్యప్రదేశ్ సీఎం గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉంటారు అనుకుంటే ఆయన్ని కేంద్రానికి రప్పించారు, అక్కడ మోహన్ యాదవ్ అన్న కొత్త ముఖానికి చాన్స్ ఇచ్చారు. హర్యానాలో నాయబ్ సింగ్ సైనీకి అవకాశం ఇవ్వడమూ బీజేపీ వ్యూహం లో భాగమే అని అంటున్నారు.

ఈ విధంగా సీఎంల ఎంపికతో బీజేపీ మోడీ షాల నాయకత్వంలో కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. దాని వల్ల కొత్త నాయకులు తయారు అవుతారన్నది ఒకటైతే పార్టీ పటిష్టంగా ఉండేలా చూడడం, నాయకుల కంటే పార్టీకే జనాలు ఓటు వేసేలా చూడడం మరో విధానంగా ఉంది. ఇక బీజేపీ కొత్త నాయకత్వానికి చోటు ఇచ్చినా పార్టీలో మిగిలిన వారిని అందరినీ కలుపుకుని పోయేలా చూడడంలోనూ విజయ మంత్రం దాగుంది అని అంటున్నారు.

Tags:    

Similar News