ఢిల్లీ సీఎం ఎంపికకు కౌంట్ డౌన్...చాన్స్ వారికే ?

దానికి కారణం ఆశావహులు ఎక్కువగా ఉండడంతో బీజేపీ హైకమాండ్ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది.

Update: 2025-02-14 00:30 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా వారం రోజులు కావస్తోంది. బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఒకటి రెండు రోజులలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కానీ బీజేపీ శాసనసభా పక్ష నేతను అయితే ఎన్నుకోలేదు. దానికి కారణం ఆశావహులు ఎక్కువగా ఉండడంతో బీజేపీ హైకమాండ్ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది.

ఇక చూస్తే ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్యాన్స్ అమెరికా పర్యటనను పెట్టుకున్నారు. ఆయన వచ్చిన తరువాత బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలసి చర్చించి ఢిల్లీ సీఎం ఎవరో ఎంపిక చేస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే కనుక ఢిల్లీ కొత్త సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు అయింది.

ఈ నెల 16న ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హైకమాండ్ తరఫున ఇద్దరు సీనియర్ నాయకులను పంపిస్తారు. ఈ భేటీలో కొత్త సీఎం అభ్యర్ధిని ఎంచుకుంటారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి మళ్ళీ రావడానికి ఏకంగా 27 ఏళ్ళు పట్టింది.

దాంతో చాలా మంది సీనియర్లు బీజేపీలో ఉన్నారు. అయితే ఢిల్లీ సీఎం పదవిని మహిళకు కేటాయించాలన్న ఆలోచన అధినాయకత్వం లో ఉంది అని అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే దళిత వర్గాలకు చెందిన నాయకుడికి ఈ పదవి ఇస్తారు అని చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించిన జెయింట్ కిల్లర్ అయిన పర్వేష్ వర్మకు అధినాయకత్వం ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు.

అలా ఆయనకు సీఎం గా ప్రకటించి ఉప ముఖ్యమంత్రి పదవులు మహిళకు ఒకటి దళితులకు ఒకటి ఇచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. చూస్తే కనుక బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపిక మాత్రం బీజేపీకి ఒక సవాల్ గా మారుతోంది అని అంటున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన వారికి ఈ పదవి ఇవ్వాలి. అంతే కాదు అంతా కలసి మంచి పాలన అందించేలా చూడాలి.

ఎన్నో హామీలను ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. దాంతో సజావుగా పాలన సాగాలంటే అంతా సమిష్టిగా ఉండాలి. అసంతృప్తులు అయితే ఎక్కడా ఉండరాదు. దాంతో బీజేపీ హైకమాండ్ ఆచీ తూచీ అడుగులు వేస్తోంది.

మరో వైపు చూస్తే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాక నూతన ప్రభుత్వం ఒకటి రెండు రోజులలో ప్రమాణం చేస్తుంది అని అంటున్నారు. ఈ మేరకు కూడా కసరత్తు సాగుతోంది. అంతే కాదు ఢిల్లీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఎండీయే మిత్ర పక్షాలతో పాటు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు కీలక నాయకులు అంతా హాజరవుతారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోంది.

Tags:    

Similar News