మహా విజయంతో బీజేపీ దూకుడు... టీడీపీకి కొరుకుడు పడని బిల్లు
ఈ చట్టానికి సవరణ చేయడం ద్వారా వాటిని ప్రభుత్వం పరం చేయడానికి బీజేపీ చూస్తోంది అని ముస్లిం మైనారిటీలు గగ్గోలు పెడుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వైభవం ఒక్క లెక్కన వెలిగిపోతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కనీ వినీ ఎరగని తీరున బీజేపీ విజయం సాధించింది. ఏకంగా వార్ వన్ సైడ్ చేసేంది. విపక్షాలను ఏమి మాట్లాడాలో తెలియనంతగా చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ విపక్షాలను గట్టిగానే ఏకి పారేశారు.
పార్లమెంట్ ని సజావుగా నిర్వహించుకుని ప్రజా సమస్యల సాకారానికి ఉపయోగించుకోవాల్సి ఉండగా రాజకీయ యాగీ చేస్తున్నాయని అన్నారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద కూడా మాట్లాడారు. రాజ్యాంగంలో వక్ఫ్ కి తావు లేదని అన్నారు. దాంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లుని ఆమోదించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చేశారు
బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన కొత్తలలో ఈ బిల్లుని సభలోకి తీసుకుని వచ్చారు. అయితే అప్పట్లో విపక్షాల అభ్యంతరాల మేరకు దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ప్రస్తుతం జేపీసీ నివేదిక కూడా పార్లమెంట్ వద్ద ఉంది. దాంతో మరోసారి లోక్ సభలోకి ఈ బిల్లు వస్తోంది.
అసలే మహారాష్ట్ర హర్యానా ఎన్నికలలో విజయంతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. ఇక ఈ బిల్లు చట్టం దాల్చాసిందే అని పట్టుదలగా ఉంది. దేశంలో వక్ఫ్ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ చట్టానికి సవరణ చేయడం ద్వారా వాటిని ప్రభుత్వం పరం చేయడానికి బీజేపీ చూస్తోంది అని ముస్లిం మైనారిటీలు గగ్గోలు పెడుతున్నారు.
ఏపీలో వారంతా టీడీపీని కలసి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దు అని గట్టిగానే వేడుకున్నారు. అయితే బీజేపీకి ఇపుడు సంకట పరిస్థితిగా ఉంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలతో పాటు సనాతన ధర్మం వాదనను వినిపిస్తున్న జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తామని అంటోంది.
టీడీపీకి మైనారిటీలు ఇటీవల ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి ఆదరించారు. దాంతో టీడీపీకి వారి ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే జేపీసీ అని తప్పించుకున్నా ఈసారి అసలైన అంగి పరీక్ష ఎదురు కాబోతోంది. ఈ బిల్లు కాదని అంటే బీజేపీ పెద్దలకు ఆగ్రహం వస్తుంది. అలా కాదు అని మద్దతు ఇస్తే టీడీపీకి ఉన్న లౌకిక ముద్ర చెరిగిపోయి ప్రమాదం వస్తుంది.
మొత్తానికి టీడీపీ సంకట పరిస్థితినే ఈసారి శీతాకాల సమావేశాలలో ఎదుర్కోబోతోంది అని అంటున్నారు. అసలు టీడీపీ స్టాండ్ ఏంటి అన్నదే ఇపుడు ఉత్కంఠగా ఉంది. దేశంలో ప్రతీ రాజకీయ పార్టీ తన విధానం ఈ విషయంలో వ్యక్తం చేసే స్థితిలో ఉన్నాయి. టీడీపీకే ఇపుడు రెండిందాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి దీనిని ఎలా ఎదుర్కొంటారో మరి.