కాశ్మీర్ లో బీజేపీకి అప్పనంగా అయిదు సీట్లు ?

జమ్మూ కాశ్మీర్ లో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ తాపత్రయపడుతోంది

Update: 2024-10-06 03:33 GMT

జమ్మూ కాశ్మీర్ లో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ తాపత్రయపడుతోంది. ఆ పార్టీ కోరిక అది. బీజేపీ పూర్వ రూపం జనసంఘ్ పుట్టుక, ఉనికి పోరాటం అన్నీ కూడా కాశ్మీర్ సంఘర్షణ తోనే ముడిపడి సాగాయి. అలాంటి కాశ్మీర్ ని బీజేపీ ఎలా వదిలేస్తుంది.

బీజేపీ అజెండాలోని కీలకమైన అంశాన్ని 2019 ఎన్నికల తరువాత నేరవేర్చింది కూడా కాశ్మీర్ లో అధికారం కోసమే. 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ లో తాము సులువుగా గెలవచ్చు అన్నది బీజేపీ ప్లాన్. అయితే బీజేపీ అనుకున్నట్లుగా జమ్మూలో అసెంబ్లీ సీట్లను పెంచి కాశ్మీర్ లో తగ్గించలేకపోయింది.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు కేవలం 3 సీట్లు మాత్రమే జమ్మూలో పెరిగాయి. ఇక బీజేపీ ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా పని చేసింది. అదేంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 తో పాటు 2023 జూలైలో చేసిన సవరణల ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో అయిదుగు ఎమ్మెల్యేలను లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా నామినేట్ చేయగలరు. అంటే వీరిని ఆయనే నియిమిస్తారు అన్న మాట.

కేంద్ర హోం శాఖ సూచనల మేరకు వీరిని లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు అంటే ఆ అయిదుగురు కచ్చితంగా బీజేపీకి చెందిన వారే ఉంటారు అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదని విపక్షాలు అంటున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రస్తుతం సీట్ల సంఖ్య 90. ఈ అయిదుగురిని కనుక నామినేట్ చేస్తే ఆ నంబర్ 95 అవుతుంది. అపుడు మ్యాజిక్ ఫిగర్ 48 అవుతుంది. అంటే ఆ నంబర్ ఎవరికి వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు అన్న మాట.

ఇక బీజేపీకి ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ అయిదుగురు ఎమ్మెల్యేలు అప్పనంగా అందినట్లే అని అంటున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ లో హంగ్ అసెంబ్లీ రావచ్చు అని అంటున్నారు. ఇక బీజేపీకి ఎలా చూసుకున్నా 30 దాకా ఎమ్మెల్యేలు గెలిచేలా ఉన్నారు. దాంతో పాటు ఈ అయిదు కలిపిస్తే 35 అవుతుంది. ఇక మ్యాజిక్ ఫిగర్ కి 13 మంది తక్కువ పడతారు. ఇతరుల కేటగిరీలో కొంతమందిని అలాగే ఇతర పార్టీల మద్దతుని కూడగట్టుకుని ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతామా అని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

హర్యానా ఎటూ పోతుంది. కాశ్మీర్ లో విజయం సాధిస్తే అది దేశమంతా చెప్పుకునే ఘనమైన విజయం అవుతుందని, దాంతో మరోమారు తన హిందూత్వ విధానాలకు పదును పెట్టుకోవచ్చునని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. అయితే ఈ అయిదురుగు ఎమ్మెల్యేలను నామినేట్ చేసే విధానం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags:    

Similar News