ఉక్కు కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
దీని వల్ల ఉక్కు కష్టాలు తీరుతాయని కూటమి నేతలు చెబుతున్నారు. అంతే కాదు ఆ ఘనత తమదేనని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం భారీ ప్యాకేజిని ప్రకటించింది. అక్షరాలా 11వేల 400 కోట్ల రూపాయల ప్యాకేజి అది. దీని వల్ల ఉక్కు కష్టాలు తీరుతాయని కూటమి నేతలు చెబుతున్నారు. అంతే కాదు ఆ ఘనత తమదేనని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలు మాత్రం ఈ ప్యాకేజి పట్ల పెదవి విరుస్తున్నారు. ఈ ప్యాకేజి కాదు ప్రైవేటీకరణ లేదు అని ప్రధాని నరేంద్ర మోడీ చేత చెప్పించండి అని సవాల్ చేస్తున్నాయి. ప్యాకేజీ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని మరో రెండేళ్ళలో విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ మొదటికే వస్తుందని అపుడు ప్రైవేట్ పరం చేయడానికే ఈ ఎత్తుగడ అని కూడా విమర్శిస్తున్నారు.
దీంతో బీజేపీ నేతలకు చిర్రెత్తుకుని వస్తోంది. ప్యాకేజితో తాము రాజకీయ మైలేజిని అందుకోవాలని చూస్తూంటే ఈ విధంగా కార్మిక సంఘాలు మోకాలడ్డడం పట్ల వారు ఆగ్రహంగా ఉన్నారు. దాంతో దానిని దాచుకోలేక
బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణు కుమార్ రాజు అయితే బయటకు కక్కేశారు.
కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజి విశాఖ ఉక్కు కోసమని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో కార్మికులకు మేలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రకటించిన ప్యాకేజి అది అని అన్నారు. దాని మీద విమర్శలు చేయడం మంచిది కాదని కార్మిక సంఘాల నేతలకు సూచించారు.
వారికి అది నచ్చకపోతే రాజీనామాలు చేసి వెళ్ళిపోవచ్చు అంటూ ఫైర్ అయ్యారు. ప్యాకేజీ మీద ఆశలకు అంతు ఉండాలని ఆయన అన్నారు. కొందరు కార్మిక సంఘాల నాయకుల తీరు చూస్తూంటే ఏ మాత్రం అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని రాజు గారు కోపం చేసుకున్నారు.
కార్మిక నాయకులు కొందరు అవివేకంగా మాట్లాడుతున్నారని కూడా అన్నారు. ప్యాకేజి వారి వల్లనే వచ్చిందని అనడం కూడా భావ్యం కాదని అన్నారు. కేంద్రం చిత్తశుద్ధితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో మంచి చేసిన కేంద్ర ప్రభుత్వం తీరుని ఆయన మెచ్చుకున్నారు. కార్మికుల కోసం విశాఖ ఉక్కు సెంటిమెంట్ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కానీ కార్మిక సంఘాల నేతలు మాత్రం వేరేగా స్పందిస్తున్నారు అని ఆయన అన్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కార్మికుల విషయంలో రాజు గారు ఆగ్రహంతో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కార్మిక సంఘాలకు వామపక్షాల అనుబంధం ఉంది. బీజేపీకి వామపక్ష నాయకులకు సిద్ధాంత వైరుధ్యం కూడా ఉంది. ఇపుడు ఆర్ధిక ప్యాకేజి విషయంలో ఎంతో చేశామని బీజేపీ సహా టీడీపీ నేతలు అంటూంటే ఏమీ చేయలేదని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత దూరం సాగుతుందో.