ఆరు మాసాల పాలన: బీజేపీ ఎంపీలు ఏం సాధించారు ..!
అయితే.. బీజేపీ నేతల పరిస్థితి ఏంటి? ఆరు మాసాల్లో ఏం సాధించారు? తమను గెలిపిస్తే.. అద్భుతాలు చేస్తామని చెప్పిన బీజేపీ ఎంపీలు ఎంత వరకు అద్భుతాలు చేశారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అయింది. ఈ క్రమంలో ఎవరికి వారు ప్రోగ్రెస్ రిపోర్టులు చూసుకుంటున్నారు. ఇటు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, అటు పాలన పరంగా మంత్రులు కూడా తమ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. బీజేపీ నేతల పరిస్థితి ఏంటి? ఆరు మాసాల్లో ఏం సాధించారు? తమను గెలిపిస్తే.. అద్భుతాలు చేస్తామని చెప్పిన బీజేపీ ఎంపీలు ఎంత వరకు అద్భుతాలు చేశారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ ఎంపీలు విజయం దక్కించుకున్నారు.
గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఒకటి రెండు స్థానాలకే పరిమితమైన కమల నాథులు ఇప్పుడు మాత్రం 3 స్థానాల్లో విజయం సాధించారు. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం స్థానాలు కమలనాథులకు దక్కాయి. మరి ఈ ఆరు మాసాల్లో వారు ఏం చేశారు? ఏం సాధించారు? అనేది ప్రశ్న. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.. తన కాంట్రాక్టులను విస్తరించుకున్నారనేది వాస్తవం. కడప నుంచివిశాఖ వరకు.. తన పరిధిని విస్తరించుకుని.. పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్నారు.
స్థానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఇక, రాజమండ్రి ఎంపీగా, బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా పురందేశ్వరి కూడా.. ఏమీ తీసుకురాలేక పోయారు. కేంద్రం ఇస్తున్న పథకాలనే ఆమె చూపిస్తున్నారు. పైగా.. నా పరిధిలో ఉన్నవి మాత్రమే చేస్తానని ఆమె చెప్పడం ద్వారా.. తన పరిధికి గీతలు గీసుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. ఆమె పార్టీ వ్యవహారాలతో పాటు వ్యాపార వ్యవహారాల్లో ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారనే చర్చ కూడా ఉంది.
ఇక, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ.. కేవలం విగ్రహాల ఆవిష్కరణలకు రిబ్బన్ కటింగులకు మాత్రమే పరిమితమయ్యారు. ఆరు మాసాల్లో కేంద్రం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చింది.. నియోజకవర్గానికి కేటాయించింది మాత్రం ఏమీ కనిపించడం లేదు. సహాయ మంత్రిగా కూడా.. ఆయన నియోజకవర్గంలో చేసింది లేదు. అయితే.. ఆరు మాసాల కాలం స్వల్పమేనని.. మున్ముందు చేసేందుకు ప్రయత్నిస్తామని మాత్రం ఈ ఎంపీలు చెబుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.