బీజేపీని చూసి నవ్వుకుంటున్నారు...కేంద్ర మంత్రి మాటలతో !
బీజేపీ తెలంగాణా రాజకీయాల్లో ఏమిటి అన్నది ఈ రోజుకీ ఒక ప్రశ్నగానే ఉంది. సీట్లు దక్కుతున్నాయి.
బీజేపీ తెలంగాణా రాజకీయాల్లో ఏమిటి అన్నది ఈ రోజుకీ ఒక ప్రశ్నగానే ఉంది. సీట్లు దక్కుతున్నాయి. ఓట్లు పెంచుకుంటోంది కానీ తెలంగాణా అంతటా బలంగా ఉందా అంటే లేదు. అదే సమయంలో బలమైన పార్టీల మీద విమర్శలు చేయడం ద్వారా తన అస్తిత్వాన్ని చాటుకోవాలని చూస్తోంది. తెలంగాణా ఉద్యమంతో ఒక పటిష్టమైన ప్రాంతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ని తన కొంగును కట్టేసుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది అన్న రూమర్స్ అయితే చాలా కాలంగా ఉన్నాయి.
ఇపుడు బీఆర్ఎస్ ఓడి ఎన్నడూ లేనంతగా కష్టకాలంలో ఉంది. దాంతో బీఆర్ఎస్ ని మరింతగా ప్రలోభపెట్టి తమ వైపునకు తిప్పుకుని ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల వెనక లాజిక్ కూడా ఉంది. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనులు చాలానే చేసింది. అనేక పార్టీలను కకావికలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దాంతో బీజేపీ మీద ఈ ఆరోపణలను నమ్మే వారూ ఉన్నారు.
పైగా కేంద్రంలో అధికారం ఉంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తోంది. అది ఎలా ఉంది అంటే తుంటి కొడితే పళ్ళు రాలాయి అన్న చందంగా అంటున్నారు. బీఆర్ఎస్ మహిళా నేత కవితలు బెయిల్ రావడం కాంగ్రెస్ చలువతోనే అని బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వారు చేస్తున్న ఆరోపణలను చూసి జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది అని అంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో పదేళ్ళుగా అధికారంలో లేదు. కాంగ్రెస్ కి తెలంగాణాలో బీఆర్ఎస్ ఆల్టర్నేషన్ గా ఉంది. బీఆర్ఎస్ ని ఏ విధంగా కాంగ్రెస్ తన వైపు తిప్పుకోగలదు అన్నది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ తిప్పుకున్నా ఆ పార్టీకి ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నది మరో ప్రశ్న. బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ పార్టీతో ఏమిటి అవసరం అన్నది కూడా లాజిక్ కి అందని ప్రశ్న.
పైగా దేశంలో అపొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ని ఆకర్షించి ఆ పార్టీ నేతకు బెయిల్ ఇప్పించేటంత స్తోమత కానీ అవసరం కానీ ఉన్నాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అంతే కాదు ఇలా కాంగ్రెస్ దేశంలో తన హవా చాటుకుంటూ చక్రాలు తిప్పుతూంటే అధికార బీజేపీ ఇవేమీ పట్టించుకోకుండా సైలెంట్ గా కూర్చుంటుందా అన్నది కూడా మరో ప్రశ్న.
ఏ ఆధారం కానీ లాజిక్ కానీ లేకుండా కాంగ్రెస్ మీద బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను చూసి అంతా నవ్వుకుంటున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారని తెలనగాణా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన నిందితురాలికి బెయిల్ రావడం, అదే నిందితురాలి తరఫున వాదిస్తున్న న్యాయవాదిని రాజ్యసభకు నామినేట్ చేయడం ఇలా రెండూ ఒకే రోజున జరిగాయి కాబట్టి కాంగ్రెస్ వల్లనేఎ ఈ బెయిల్ వచ్చింది అని బీజేపీ చెబుతోంది.
నిజానికి ఈ వాదన ఏలా ఉంది అంటే బోడి గుండుకు మోకాలికి లింక్ పెట్టే విధంగానే అని అంటున్నారు. కాంగ్రెస్ ఎంపీగా నామినేట్ అయిన ఆయన ఎన్నో కేసులు వాదిస్తారు. అందులో పస ఉంటే బెయిల్ వస్తుంది కానీ ఇలా ఏదో జరిగిందని బీజేపీ నేతలు చెప్పడమేంటి అని కూడా అంటున్నారు. అసలు ఏ మాత్రం పోలిక కానీ పొంతన కానీ లేని ఆరోపణలు ఇవి అని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పేర్లు వేరు అయినా కుంభకోణాలలో రెండు పార్టీలు ఒక్కటే అని కూడా బీజేపీ నేతలు ట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఎవరు ఏమి ఆరోపణలు చేసుకున్నా కూడా కవిత బెయిల్ వివాదం మాత్రం రాజకీయ రచ్చకు కేంద్రంగా మారింది. ఈ బెయిల్ అంశంతో బీఆర్ఎస్ అన్న పార్టీ ఫ్యూచర్ ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తున్న విషయంగా మారింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.