ఢిల్లీకి చేరిన తిరుమల లడ్డూ
తిరుమల లడ్డూ ఇష్యూ ఇపుడు దేశాన్ని హీటెక్కించేస్తోంది. ఎవరు తిరుపతి వెళ్ళినా లడ్డూ ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతారు.
తిరుమల లడ్డూ ఇష్యూ ఇపుడు దేశాన్ని హీటెక్కించేస్తోంది. ఎవరు తిరుపతి వెళ్ళినా లడ్డూ ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతారు. అంతటి పవిత్రత ఉన్నది కావడం వల్లనే లడ్డూ విషయంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారు అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఆరోపణల మీద ఇపుడు అంతటా చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గత ప్రభుత్వం అంటూ వైసీపీ మీద వరసబెట్టి చేస్తూ వస్తున్న ఆరోపణల క్రమంలో దీనిని కూడా అన్నారు. అది కూడా ఒకటి రెండు వాక్యాలతో ముగించి వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయారు.
అయితే అది అంత సీరియస్ ఇష్యూ అవుతుందని బాబు అపుడు ఊహించారా లేదా అన్నది చర్చ గా ఉంది. ఇక ఈ విషయం మీద మొదట్లో బీజేపీ ఏపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎపుడైతే తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని మీద ఘాటుగా రియాక్టు అయ్యారో ఎపుడైతే తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడారో అప్పటి నుంచి ఈ ఇష్యూ బీజేపీ పెద్దల దృష్టికి వచ్చింది.
ఇక గత ఇరవై నాలుగు గంటలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా అయితే తిరుపతి లడ్డూ నాణ్యత మీద ఫోన్ లో మాట్లాడారు అని అంటున్నారు. దీని మీద పూర్తి నివేదికను పంపాలని కోరినట్లుగా చెబుతున్నారు.
మరో వైపు ఇంకో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా ఇదే ఇష్యూ మీద గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఈ విషయం క్షమించరానిదని దీని మీద విచారణ జరగాలని అంటున్నారు. అలాగే అయోధ్యలో ఉన్న హిందూ ధార్మిక సంస్థలు కూడా దీని మీద మాట్లాడాయి.
ఇక హిందూత్వనే తన అజెండా చేసుకుని ముందుకు పోతున్న బీజేపీ ఇపుడు తిరుపతి లడ్డూ అపవిత్రం అయింది అన్న దాని మీద చాలా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తిరుపతి పవిత్రత అలాగే శ్రీవారి ప్రసాదాలు నాణ్యతా లోపం వంటి వాటి మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సీబీఐ విచారణకు ఆదేశిస్తే బెటర్ అని అంటున్నారు.
ఎందుకంటే కేంద్రం చేతిలోనే సీబీఐ ఉంది. అపుడే నిజాలు నిగ్గు తేలుతాయి. అంతే కాదు తప్పు ఎవరు చేసినా శిక్షించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. నిజానికి టీటీడీ మీద గత కొన్నాళ్ళుగా ఏవో ఆరొపణలు వస్తూనే ఉన్నాయి. వాటి మీద చూసీ చూడనట్లుగానే అంతా వదిలేస్తున్నారు.
ఇపుడు ఏపీలో కూటమి ఉంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ఉంది. కాబట్టి దీని మీద గట్టిగానే దృష్టి పెట్టాలని కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడాలని అంటున్నారు. ఇక బీజేపీ అగ్ర నాయకత్వం కూడా తిరుపతి లడ్డూలో నాణ్యత లేదు, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనేని వినియోగించారు అన్న దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.
హిందువులకు సంబంధించి ప్రపంచంలోనే ఏకైక అతి పెద్ద ఆలయంగా తిరుపతి ఉంది. దాని మీదనే నీలినీడలు కమ్మేలా ప్రచారం ఉంది. అందువల్ల వీటిలో నిజాలు బయటకు తీసి ప్రపంచంలోకి హిందువులందరి
అనుమానాలను తీర్చాల్సి ఉంది. అందువల్ల కేంద్రమే రంగంలోకి దిగాలని కోరుతున్నారు.