బీజేపీకి కొత్త సారథి ఎవరు..? పేరు, ముహూర్తం ఖరారైందా..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పదవి కోసం చాలా మంది సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతూనే ఉన్నారు.

Update: 2024-12-16 08:11 GMT

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పదవి కోసం చాలా మంది సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతూనే ఉన్నారు. దీంతో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా అనేది తెలియకుండా ఉంది. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆయన అటు న్యాయం చేయలేక.. ఇటు న్యాయం చేయలేక సతమతం అవుతున్నారన్న టాక్ ఉంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత మూడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో కమలం పార్టీ కొద్దికొద్దిగా బలపడింది. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తోంది. దీంతో అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఎలా అయినా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలం పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనేది ఇంకా తేలడం లేదు.

బీజేపీ అధిష్టానం 2028 ఎన్నికలను టార్గెట్ చేసింది. ఆ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం వెతుకులాడుతోంది. అధికార పీఠం దిశగా దూసుకుపోయే సమర్థుడి కోసం వేట సాగిస్తోంది. ఇదే క్రమంలో అధ్యక్షుడి పీఠం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బీజేపీ స్టేట్ చీఫ్ కోసం పోటాపోటీ నెలకొంది. అంతేకాదు.. కొంత మంది అయితే ఏకంగా హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారన్న టాక్ ఉంది.

ఇప్పటికే కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారం చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి దక్షిణాదిలో పార్టీ వేగంగా విస్తరిస్తూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో మరిన్ని ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో కొత్త అధ్యక్షుడి నియామకంతోపాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, ఎన్.రాంచంద్రారావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయన్న ప్రచారం ఉంది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అయితే.. ఆయనకే పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయని మొన్నటివరకు బలంగా ప్రచారం సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్‌లలో పోటీచేసి ఓడిపోయారు. దాంతో అధిష్టానం ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించింది. ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. కానీ.. అది దక్కకుండా పోయింది. దీంతో ఈటలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన అనుచరులు సైతం అదే ప్రచారం చేస్తున్నారు.

ఇక.. కేంద్ర కేబినెట్‌లో చోటు ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం ఉంది. మహిళకు పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు అధిష్టానం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డీకే అరుణ.. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఆమె పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నది. ఇక.. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు సైతం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన స్థానం నుంచి ఆయన గెలుపొందడం.. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో విజయం సాధించడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. అలాగే.. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలోనూ ఆయనకు ఆయనే సాటి. దాంతో రఘునందన్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు టాక్.

నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి వరుసగా రెండోసారి గెలుపొందారు ధర్మపురి అర్వింద్. ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా ఆయన పేరుగాంచారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. బీజేపీ చీఫ్ సీటు బీసీలకే దక్కే అవకాశం ఉండడంతో అర్వింద్ వర్గం బోలెడు ఆశలు పెట్టుకుందని సమాచారం. మరోవైపు.. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. కానీ.. దీనిపై నిన్ననే సంజయ్ క్లారిటీ ఇచ్చారు. తాను అధ్యక్ష పదవి రేసులో లేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. వీళ్లలో అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సంక్రాంతి వరకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Tags:    

Similar News