విధేయుల కోసం వెతుకులాట.. బీజేపీ సారథి ఎవరు?
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి అనేక సమీకరణలను పరిశీలిస్తున్నారు.;

కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీ.. పార్టీ జాతీయ సారథి కోసం వెతుకులాట ప్రారంభించింది. వాస్తవానికి గత కొన్నాళ్ల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. నిన్న మొన్నటి వరకు ప్రధాని విదేశీ పర్యటనలో బిజీగా ఉండడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా శనివారం పార్టీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో సమావేశమైంది. దీనికి ప్రధాని మోడీ, అమిత్‌షాలు మినహా.. ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికేపరిశీలనలో ఉన్న కొందరి పేర్లను తొలి దశ వడపోత చేయనున్నారు. అనంతరం.. ఈ జాబితాను ప్రధాని మోడీ సహా.. అమిత్ షా నేతృత్వంలో త్వరలోనే జరగనున్న మరో సమావేశంలో పెడతారు.
అప్పుడు కీలక నిర్ణయం తీసుకుని.. బీజేపీ జాతీయ సారథిని ఫైనల్ చేయనున్నారు. ఇదిలావుంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి అనేక సమీకరణలను పరిశీలిస్తున్నారు. దేశంలో ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలా లేకపోతే ఉత్తరాది నాయకుడికే మరోసారి పట్టం కట్టాలా? అనేది కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌కుచెందిన జేపీ నడ్డా.. అటు కేంద్ర మంత్రిగాను.. ఇటు బీజేపీ సారథిగాను ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దఫా దక్షిణాదికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నది ఢిల్లీ వర్గాల టాక్. గతంలో వెంకయ్యనాయుడు, తెలంగాణకు చెందిన లక్ష్మణ్ వంటివారు కూడా.. జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు.
ఈ పరంపరలో ఇప్పుడు బండి సంజయ్ బీసీ కోటాలోను, ఓసీ కోటాలో కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు. మరోవైపు.. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం యడియూరప్ప పేరు కూడా వినిపిస్తున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎవరు జాతీయ పగ్గాలు చేపట్టినా.. పార్టీ విధానాలతోపాటు.. ఆర్ ఎస్ ఎస్ పంథాను కూడా ఆకళింపు చేసుకునే నాయకుడే కావాలి. పైగా.. కేంద్రంలోని పెద్దలకు అత్యంత వీర విధేయులుగా కూడా ఉండాలి. ఇక, ఈ సమయంలోనే యువతకు పెద్ద పీట వేయాలని కూడా కమల నాథులు చూస్తున్న నేపథ్యంలో ఏపీకి చెందిన రామ్ మాధవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. ఈయనకంటే ఘనుడు.. అన్నట్టుగా మోడీని నిర్విరామంగా మోసిన.. తమిళనాడు బీజేపీ చీఫ్.. ప్రస్తుతం రాజీనామా చేసిన అన్నామలై పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన పేరుతో రాజకీయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆపార్టీకి కౌంటర్ గా తమ పార్టీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా కూడా మరో ప్రచారం ఉంది. ఇదే జరిగితే బీసీ సామాజిక వర్గం జాబితాలో బండి సంజయ్ పేరు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక, ఎవరు పగ్గాలు చేపట్టినా.. కీలకనిర్ణయాలు తీసుకునే అవకాశం ఇటీవల కాలంలో కనుమరుగైంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు చెప్పింది చేయడం.. చేసింది ప్రకటించడమే కీలకంగా మారింది. అందుకే.. విధేయుల కోసం వీరలెవిల్లో వెతుకులాట చేపడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. మరి ఎవరికి పగ్గాలు దక్కుతాయో చూడాలి.